దళిత బంధు ఓ పథకం కాదు.. ఇది ఓ ఉద్యమం.. రాష్ట్రాభివృద్ధిలో అట్టడుగు వర్గాలు భాగస్వామ్యం కావాలిః సీఎం కేసీఆర్

|

Jul 26, 2021 | 10:00 PM

ఉత్పాదక రంగానికి ఇంతకాలం దూరంగా ఉన్న వర్గాలను కూడా రాష్ట్ర ఆర్ధికాభివృద్ధిలో భాగస్వాములు చేసేలా దళిత బంధు పథకం అమలు చేస్తామంటున్నారు సీఎం కేసీఆర్.

దళిత బంధు ఓ పథకం కాదు.. ఇది ఓ ఉద్యమం.. రాష్ట్రాభివృద్ధిలో అట్టడుగు వర్గాలు భాగస్వామ్యం కావాలిః సీఎం కేసీఆర్
Cm Kcr
Follow us on

Telangana Dalita Bandhu Scheme: దళితబంధు అనేది ఓ పథకం కాదు.. ఇది ఓ ఉద్యమం అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఉత్పాదక రంగానికి ఇంతకాలం దూరంగా ఉన్న వర్గాలను కూడా రాష్ట్ర ఆర్ధికాభివృద్ధిలో భాగస్వాములు చేసేలా పథకం అమలు చేస్తామంటున్నారు సీఎం. ఈ స్కీము ప్రకటించిన రోజు నుంచే మద్దతు అనూహ్యంగా పెరుగుతోంది. పార్టీలకతీతంగా దళిత సంఘాల స్వాగతిస్తుండగా… తాజాగా లెఫ్ట్‌ పార్టీలు కూడా రైట్‌ రైట్‌ అంటూ ప్రోత్సహిస్తున్నాయి. అటు ప్రత్యర్ధి పార్టీలు మాత్రం ఇప్పటికీ దీనిని రాజకీయ పథకంగానే చూస్తున్నాయి.

హుజూరాబాద్‌ ప్రతినిధులు సాధించే విజయం మీదే.. యావత్‌ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దళిత బంధు పథకం అమలుపై హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళిత ప్రతినిధులతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో హుజురాబాద్‌ నుంచి వచ్చిన వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. పథకంలో ఇంకా ఏవైనా మార్పులు చేయాలా అని తెలుసుకున్నారు. అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు సూచించాలని వారిని కోరారు. దళిత బంధు పథకం తెలంగాణ దళితుల పాలిట వరం అని సీఎం తెలిపారు.

అసలు గ్రామాల్లో ఏం జరుగుతోంది? దళిత బంధు పథకం ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? మీ కుటుంబ సభ్యులు ఏమని చర్చించుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఈ పథకంలో అర్హత పొంది నాకు ఆర్ధిక సాయం అందితే.. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తాను.. ట్రాక్టర్‌ కొనుక్కుంటానంటూ వీణవంక మండలం కిష్టంపల్లి గ్రామ నివాసి సమ్మయ్య మీటింగ్‌లో తెలిపాడు. మరో వ్యక్తి కారు కొనుక్కుంటానని ప్రకటించాడు. వారి స్వయం నిర్ణయాధికారం గొప్పదంటూ అభినందించారు సీఎం కెసీఆర్.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఎస్సీల భూముల సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని కలెక్టర్‌కు సూచించారు.

హుజూరాబాద్‌లో ఇల్లులేని ఎస్సీ కుటుంబం ఉండకూడదని, ఇల్లులేని వారి వివరాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలముంటే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. ‘హుజూరాబాద్‌లో రేషన్‌కార్డులు, పింఛన్లు సహా అన్ని సమస్యలు పరిష్కరించాలి. ప్రతి ఎస్సీవాడలో అధికారులు పర్యటించాలి. వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు గుర్తించి నివేదిక ఇవ్వాలి. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి కేంద్రం, ఇతర రాష్ట్రాలు చేర్చుకుంటున్నాయి. దళితబంధు పథకాన్ని కూడా ఇతర రాష్ట్రాలు అనుసరించాలి’ అని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

Read Also…  కరోనా తెచ్చిన మార్పు..వధువు మెడలో తాళి కట్టకుండా..మండపంలో వరుడి వర్క్‌ఫ్రమ్‌ హోం.!:Groom Viral Video.