Huzurabad By Election: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోరుకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల సందడి మొదలైంది. తొలిరోజే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. కరోనా ఆంక్షలు పాటిస్తూ, భారీ ర్యాలీలు లేకుండా సాదాసీదాగా వెళ్లి నామినేషన్ వేశారు. మంత్రి గంగుల, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి గెల్లు నామినేషన్‌కు హాజరయ్యారు.
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం తన నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. చరాస్తులు రూ.2,82,402.44గా పేర్కొన్నారు. ఆయన ఏడాది సంపాదన కేవలం రూ. 4.98 లక్షలుగా పేర్కొన్నారు. తన పేరు మీద ఎలాంటి వ్యవసాయ భూమి లేదని.. తన భార్య పేరు మీద 12 గుంటల వ్యవసాయ భూమి ఉందని వెల్లడించారు. తన పేరు మీద 1,210 గజాల స్థలం ఉందని.. 20 లక్షల విలువ చేసే ఇల్లు ఉందని పేర్కొన్నారు. ఇక ఎలాంటి అప్పులు లేవని అఫిడవిట్‌లో వివరించారు. తనకు భార్య శ్వేత, కూతురు సంఘమిత్ర, కుమారుడు తారక రామారావు ఉన్నారని వివరించారు. తన మీద కేసుల వివరాలను కూడా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.