Huzurabad By Election: హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయాలు హీటెక్కాయి. పీఠం నీదా..నాదా..? సై అంటే సై అంటున్నారు అభ్యర్థులు. జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. పదునైన మాటలతో ప్రత్యర్థుల్లో గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. మొత్తం 61 మంది నామినేషన్స్ దాఖలు చేశారు. ఇవాళ హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్లను పరిశీలించారు ఎన్నికల అధికారులు. అయితే, పలువురు ఇండిపెండెంట్స్ సరైన పత్రాలు లేకుండా నామినేషన్స్ దాఖలు చేసినట్టు గుర్తించారు. చివరికి క్వాలిఫై అయినవారి జాబితాను ప్రకటించారు రిటర్నింగ్ అధికారి.
రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన హుజూరాబాద్ బరిలో చివరికి మొత్తం 42 మంది నిలిచారు. మొత్తం 61 మంది ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేశారు. వీటిలో 19 నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీహెచ్ రవీందర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. నామినేషన్ తిరస్కరణకు గురైన వారిలో ఏఐఎంఐఎం అభ్యర్థి తామిర్ కమల్ ఖుంద్మీరి కూడా ఉన్నారు. నామినేషన్ స్వీకరించిన వారిలో 31 మంది స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి వెంకట నర్సింగ రావు బాల్మూర్ పోటీ పడుతున్నారు.
ఇదిలావుంటే, ఉప ఎన్నిక నామినేషన్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఊరట లభించింది. రాజేందర్ పేరుతో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలనలో సరైన పత్రాలు లేకపోవడంతో ఈటల రాజేందర్ మినహా మిగిలిని ముగ్గురు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో ఇప్పలపల్లి రాజేందర్, ఇసంపల్లి రాజేందర్, ఇబ్బడి రాజేందర్ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో ఈటల రాజేందర్‌కు ఊరట లభించినట్లయ్యింది. 61మంది మంది అభ్యర్థులు 92 నామినేషన్ల సెట్లు దాఖలు చేశారు. పరిశీలనలో నిబంధనల ప్రకారం లేని 19 మంది అభ్యర్థుల 23 సెట్ల నామినేషన్లను తిరస్కరించారు. ప్రస్తుతం బరిలో ఉన్న 42 మంది అభ్యర్థులు ఉన్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. కాగా, తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 13 వరకు గడువు ఉంది.
Read Also… Global Warming: హిమాలయాల్లో పొంచి ఉన్న పెనుముప్పు.. కరుగుతున్న హిమనీ నదాలతో పొంగుతున్న సరస్సులు!