
తను ప్రభుత్వ ఉద్యోగిని. కానీ దారి తప్పింది. తన అక్రమ సంబంధంకు అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే చంపి ఆపై కట్టుకథ అల్లింది. పాల్వంచ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు కాలనీకి చెందిన ధరవత్ హరినాథ్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఇది ఆత్మహత్య కాదు, పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఈ నేరానికి సంబంధించి మృతుడి భార్య, ప్రియుడుతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున వెంగళరావు కాలనీకి చెందిన ధరావత్ హరినాథ్ (39) తన ఇంటి వెనుక స్లాబ్ హుక్కుకు వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించాడు. మృతుడి తల్లితో పాటు బంధువులు.. భార్య శృతిలయనే హరినాథ్‌ను చంపిందని.. పాల్వంచ బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. పోలీసులు విచారణ చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి తల్లి గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణలో విస్తు పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి భార్య ధరావత్ శృతిలయ ములుగు జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. గతంలో ఆమె చర్ల ఏరియాలో పనిచేస్తున్న సమయంలో కొండా కౌశిక్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినప్పటికీ శృతిలయ ప్రవర్తనలో మార్పు రాలేదు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన శృతిలయ, తన ప్రియుడు కౌశిక్.. అతని స్నేహితులతో కలిసి భర్తను వదిలించుకోవాలని పన్నాగం పన్నింది. ఈ నెల 15వ తేదీ రాత్రి హరినాథ్ మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయంలో, నిందితులు అతని గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని ఇంటి వెనుక స్లాబ్ హుక్కు కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయడంతో ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితులు.. ధరవత్ శృతిలయ (36), ఆమె ప్రియుడు కొండా కౌశిక్ (31), వారికి సహకరించిన చెన్నం మోహన్ (32)
డేగల భాను (23)లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..