
తొలి విడత పల్లె పోరులో లెక్క తేలింది. గ్రామాల్లో హైఓల్టేజ్ క్రియేట్ చేసిన పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు మెజారిటీ గ్రామాల్లో విజయకేతనం ఎగురవేశారు. గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అనుచరులు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.
అయితే ఖమ్మం జిల్లాలో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి భర్త ఓటమి జీర్ణించుకోలేక పోతున్నాడు. ఊరి కోసం ఏ పని ఉన్నా చేశాను.. ఆపద వస్తే ముందు ఉన్నాను. ఎంతో ఖర్చు చేశాను.. చివరకు సర్పంచ్ ఎన్నికల్లో ఓడించారు.. న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. కొన్ని గంటల పాటు హైడ్రామా.. ఉత్కంఠ మధ్య చివరకు ఆందోళన విరమించాడు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యా తండాలో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా మాలోత్ రంగా భార్య పోటీ చేసింది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ స్వాతి గెలుపొందింది. అయితే తాను గ్రామంలో సేవ చేస్తున్నా.. డబ్బులు ఖర్చు పెట్టినా గెలవలేదనీ, రిగ్గింగ్, అక్రమాలు చేసి తనను ఓడించారని.. న్యాయం చేయాలని కోరుతూ రంగా గ్రామంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. దాదాపు ఆరు గంటల పాటు టవర్‌పైనే ఉండటంతో పోలీసులు, ఫైర్ సిబ్బందితో చేరుకుని మాట్లాడే ప్రయత్నం చేసినా ససేమేరా అన్నాడు.
చివరకు విచారణ జరిపేందుకు ఎమ్మార్వో హామీతో ఆందోళన విరమించిన రంగా సెల్ టవర్ దిగి వచ్చాడు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ ల్యాండ్ విషయంలో ఇలాగే సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడని స్థానికులు అంటున్నారు. న్యాయం చేయకపోతే మళ్ళీ సెల్ టవర్ ఎక్కుతానని మాలోత్ రంగా హెచ్చరించాడు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..