
Sammakka Saralamma Jathara Hundi Offerings
మేడారం, ఫిబ్రవరి 11: సమ్మక్క–సారక్క జాతర 2026 సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హూండీల లెక్కింపు హనుమకొండలోని TTD కళ్యాణ మండపంలో కొనసాగుతోంది. దేవాదాయ శాఖ అధికారులు, సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు తెలిపారు. జాతరకు సంబంధించి మొత్తం 828 హూండీలు ఏర్పాటు చేయగా, వాటిలో 780 ఇనుప హూండీలు, 45 వస్త్ర హూండీలు, 3 బియ్యం హూండీలు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు అన్ని 828 హూండీలను తెరిచి లెక్కించగా మొత్తం రూ.12,64,67,051 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
తేదీల వారీగా లెక్కింపు వివరాలు ఇలా..
- ఫిబ్రవరి 5: 125 హూండీలు – రూ.2,49,65,000
- ఫిబ్రవరి 6: 160 హూండీలు – రూ.3,54,25,200 (విదేశీ కరెన్సీ మార్పిడి రూ.63,436)
- ఫిబ్రవరి 7: 140 హూండీలు – రూ.2,01,21,440 (విదేశీ కరెన్సీ మార్పిడి రూ.71,283)
- ఫిబ్రవరి 8: 200 హూండీలు – రూ.2,64,75,757
- ఫిబ్రవరి 9: 163 హూండీలు – రూ.1,12,63,000
- ఫిబ్రవరి 10: 40 హూండీలు – రూ.80,81,935
ఫిబ్రవరి 10న లెక్కించగా రూ.80,81,935 నగదును పర్యవేక్షణాధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. బంగారం, వెండి కానుకలను వేర్వేరుగా ఇనుప హూండీలలో భద్రపరిచారు. వాటి విలువ నిర్ధారణ (అప్రైజ్‌మెంట్) ప్రక్రియ కొనసాగుతోంది. నాణేల లెక్కింపు, E-హుండీ లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు స్పష్టం చేశారు. హూండీల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంతంగా కొనసాగుతోందని, అన్ని నిబంధనల మేరకు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.