
ఇటీవల కాలంలో చెట్లను నరికేయడంతో అడవిలో ఉండాల్సిన వణ్యప్రాణులు సర్పాలన్ని జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలా వచ్చిన వాటిని చూసి జనాలు భయాందోళనకు గురై వాటికి కొట్టి చంపడమో లేదా.. అటవీశాఖ అధికారుల సహాయంతో తిరిగి అడవితో వదిలేయడమో జరుగుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపం వద్ద ఓ భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. మొదట దాన్ని చూసిన జనాలు కర్రేమో అనుకున్నారు. కానీ అది కదులుతుండడంతో దగ్గరకు వెళ్లి చూసి షాక్ అయ్యారు. దాంతో భయాందోళనకు గురై దాన్ని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు.
కానీ అది ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. కొండ చిలువ ఉందనే సమాచారంతో దాన్ని చూసేందుకు భారీగా జనాలు గుమిగూడారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు హుటాహుటీన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అది వారికి చిక్కకుండా చాలా సేపు ఇంబ్బంది పెట్టింది. దాదాపు అరగంట పాటు శ్రమించిన అధికారులు ఎట్టకేలకు దాన్ని పట్టుకున్నారు.
తర్వాత దాన్ని అక్కడి నుంచి ఒక సంచిలో తీసుకెళ్లి అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో స్థానికులంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఎప్పుడూ జనాలు తిరుగుతూ ఉంటారు, ఇక్కడికి ఇంత పెద్ద కొండ చిలువ ఎలా వచ్చిందో అనే ఆయోమయంలో పడిపోయారు జనాలు. ఈ ప్రాంతంలో ఇంకా ఏమైనా కొండచిలువలు ఉన్నాయా అని చర్చించుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతం మొత్తం గాలించాలని అటవీశాఖ అధికారులను కోరారు.