Ustad Bade Ghulam Ali Khan: అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సమాధి ఎక్కడుందో తెలుసా..
అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు పద్మభూషణ్ ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ అంతిమ గడియలు ఎక్కడ గడిచాయో చాలా మందికి తెలియదు? ఆయన సమాధి ఎక్కడుందో కూడా తెలియదు? హైదరాబాద్‌తో ఆయనకు విడదీయరాని సంబంధం ఉందన్న విషయాన్ని గుర్తు ఎరిగిన..
Hindustani singer: అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు పద్మభూషణ్ ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ అంతిమ గడియలు ఎక్కడ గడిచాయో చాలా మందికి తెలియదు? ఆయన సమాధి ఎక్కడుందో కూడా తెలియదు? హైదరాబాద్‌తో ఆయనకు విడదీయరాని సంబంధం ఉందన్న విషయాన్ని గుర్తు ఎరిగిన వారు కూడా తక్కువే! ఆఖరి దశలో ఆయనను అక్కున చేర్చుకున్నది హైదరాబాదే! ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది! ఇవాళ ఆ సంగీత సామ్రాట్ జయంతి. ఆయన వర్ధంతి కూడా ఇదే నెలలో ఉంది. ఏప్రిల్ 25న ఆయన కన్నుమూశారు. కొన్నేళ్ల వరకు ఆయన సమాధి ఆలనాపాలనా చూసేవారు లేరు.. జయంతి రోజునో, వర్ధంతి రోజునో సందర్శకులు వస్తారన్న కారణంగా శుభ్రం చేసేవారు. ఇప్పుడు ఆయన సమాధి కొత్త రూపును సంతరించుకుంది. హైదరాబాద్ పాతబస్తీలోని దాయరా మీర్ మొమిన్ దగ్గర ఉన్న బడే గులాం అలీఖాన్ సమాధికి రంగులేశారు నాలుగువైపులా ఉన్న గ్రిల్స్‌కు ఆకుపచ్చటి రంగును అద్దారు. సమాధి దగ్గర ఉన్న ఆకు అలమలను తొలగించారు. వర్ధంతి సమయానికి మరింత గొప్పగా తీర్చిదిద్దబోతున్నారు.
అవిభాజ్య భారతదేశపు పశ్చిమ పంజాబ్‌లోని కసూర్‌లో 1902లో జన్మించారు బడేగులాం అలీఖాన్. నాలుగేళ్ల ప్రాయంలోనే ఆయనకు పన్నెండు స్వరాలు పట్టుబడ్డాయి. సంగీతమే తన మాతృభాష అయ్యిందని తర్వాతి కాలంలో చెప్పుకున్నారాయన! బాల్యం నుంచే సంగీతంపై కఠోర సాధన చేశారు. అనతి కాలంలోనే ఆయన మంచి గాయకుడగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆయన సంగీత కచేరి ఉందంటే సంగీతాభిమానులు తండోపతండాలుగా వచ్చేవారు. 1939లో కలకత్తాలో చేసిన సంగీత కచేరితో ఆయన ఖ్యాతి దేశం నలుమూలలా విస్తరించింది. 1944లో బొంబాయి యూనివర్సిటీ కాన్వొకేషన్ హాలులో విక్రమాదిత్య సంగీత పరిషత్తు తరఫున బడేగులాం అలీఖాన్ చేసిన కచేరీ శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. అప్పట్లో ఉస్తాద్ ఫయ్యాజ్‌ఖాన్ వంటి గొప్ప గాయకుల కచేరీకి రెండున్నర రూపాయల టికెట్ ఉండేది. పైగా వారు రాత్రంతా కచేరీ చేస్తూనే ఉండేవారు. అలాంటి సమయంలో బడే గులాం ఆలీఖాన్ కచేరీకి మూడున్నర రూపాయల టికెట్ ఉండేది. పైగా మూడు గంటల కంటే ఒక్క నిమిషం కూడా అధికంగా ఆయన పాడేవారు కాదు. దీన్ని బట్టి ఆయన ఎంత గొప్ప గాయకులో అర్థం చేసుకోవచ్చు. 1955లో మద్రాస్‌లో నటుడు శివాజీగణేశన్ తమ్ముడి పెళ్లి జరిగింది. ఆ సందర్భంగా బడేగులాం అలీఖాన్ కచేరీ ఏర్పాటు చేశారు. ఆ కచేరీకి తమకు ఆహ్వానం లేకపోయినా సిగ్గు విడిచి వెళ్లామని బాపు రమణలో ఓ సందర్భంలో చెప్పుకున్నారు. ఆయన పాటకున్న సమ్మోహన శక్తి అలాంటిది. బాపుకు ఆయనంటే ఎంతో ఇష్టం. అందుకే బడేగులాం అలీఖాన్ బొమ్మను అందంగా వేశారు. నోరు తెరచి ఉన్న ఉస్తాద్ నోట్లో ఓ కోయిల పాడుతున్నట్టు బొమ్మ గీశారు. ఘంటసాలకూ అంతే.. ఆయనకు వీరాభిమాని. బడే గులాంఅలీఖాన్ మద్రాస్‌కు వచ్చినప్పుడు ఘంటసాల ఆయనకు ఆతిథ్యమిచ్చారు. ఆయన దగ్గర నుంచి హిందుస్తానీ నేర్చుకున్నారు. తర్వాతి కాలంలో హిందుస్తానీ రాగాలతో అనేక పాటలు స్వరపరిచారు.
మొగలే ఆజం సినిమాలో తాన్‌సేన్ పాత్రకు బడే గులాంఅలీఖాన్‌తో పాడించాలన్నది దర్శకుడు కె. ఆసిఫ్ అభిలాష. సంగీత దర్శకుడు నౌషాద్‌కు ఆ విషయం చెప్పారు. ఓ రోజు ఉదయం ఇద్దరూ కలిసి బడే గులాం అలీఖాన్ ఇంటికి వెళ్లారు.. అప్పటికే ఆ ఉస్తాద్‌తో నౌషాద్‌కు పరిచయం ఉంది కాబట్టి మెల్లగా వచ్చిన పని చెప్పాడు.. సినిమాలకు తాను పాడటమేమిటి అంటూ గయ్యిమన్నారు అలీఖాన్ సాబ్. అయినా పట్టువదల్లేదు.. బతిమాలారు. చివరాఖరుకు పారితోషికం ఎంత కావాలన్నా ఇస్తామన్నారు.. ఎక్కువ మొత్తం ఆడిగితే మరో మాట మాట్లాడకుండా ఇద్దరూ వెళ్లిపోతారన్న ఉద్దేశంతో పాటుకు పాతికవేలు కావాలన్నారు బడే గులాం అలీఖాన్. అంతేనా… మీరు పాడటమే మాకు భాగ్యం, బంగారం అంటూ అప్పటికప్పుడు 50 వేల రూపాయల చెక్కు ఇచ్చారు ఆసీఫ్. ఆ రోజుల్లో లతా మంగేష్కర్, రఫీ లాంటి టాప్‌మోస్ట్ గాయకులు పాటకు 400 రూపాయలు తీసుకునేవారు.. అంటే బడే గులాం అలీఖాన్‌కు ఇచ్చిన మొత్తం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.
పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత బడేగులాం అలీఖాన్‌కు అక్కడ ఉండటం ఇష్టం కాలేదు. స్వభావంలో తాను హిందువునేనని చెప్పుకునే ఆ సంగీత విద్వాంసుడు పహాడీలో హరిఓం తత్సత్, మోహనలో మహాదేవ మహేశ్వర వంటి గేయాలను అద్భుత్ంగా రచించి పాడారు. తర్వాత పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చారు. అప్పటి ముంబాయి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయ్ ఆయనకు ఓ ఇల్లు ఏర్పాటు చేశారు. చివరి రోజుల్లో హైదరాబాద్‌లో ఉన్నారు. బషీర్‌బాగ్‌లో నవాబ్ జహీర్‌యావర్ జంగ్ ప్యాలెస్‌లో ఉన్నారు. అప్పుడే వయోలిన్ కళాకారుడు పూర్ణచందర్ ఆయన దగ్గర ఠుమ్రీలు నేర్చుకున్నారు. ఆ ప్యాలెస్‌లోనే ఆయన కన్నుమూశారు. ఆయన గౌరవార్థం బషీర్‌బాగ్ రోడ్డుకు బడే గులాంఅలీఖాన్ మార్గ్ అని పేరు పెట్టారు. ఇప్పుడా సైన్ బోర్డులు కూడా అందరికీ కనబడేలా అమరుస్తున్నారు.