Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజుల కిందట తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వర్షాలు.. మూడు, నాలుగు రోజుల పాటు గడువు ఇచ్చి మళ్లీ మొదలయ్యాయి. దీంతో భారీ వర్షాలతో వచ్చే ఇబ్బందులపై మరింత ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్. శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేష్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చేరెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. వర్షాల కారణంగా చెత్తాచెదారం పేరుకుపోకుండా చూడాలని, ప్రాంతాలన్ని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు సంభవించే అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇప్పటికే వరదలతో ఇబ్బందులు ఉండగా, మళ్లీ వరదలు వచ్చే అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని సూచించారు. అలాగే చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చూడాలన్నారు. కాగా, గత వారం రోజుల కిందట కురిసిన వర్షాల కారణంగా భారీ నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాలన్ని నీటితో నిండిపోయాయి. వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యాయి. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి నిత్యవసర సరుకులను అందించారు. చెరువులు, కుంటలు తెగిపోయి ఇబ్బందులకు గురయ్యారు. ప్రాజెక్టులన్ని నిండిపోయి జలకళ సంతరించుకుంది. ఇప్పుడు మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించడంతో అధికారులు ముందస్తుగా అప్రమత్తం అవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..