Telangana Rains: తెలంగాణపై వరుణుడు గర్జిస్తున్నాడు..రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కుమ్మరిస్తున్నాడు… ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి..భారీ వర్షాలతో భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరద నీటితో ఉప్పొంగుతోంది. గోవిందరావుపేట మండలం బుస్సాపురం గ్రామానికి సమీపంలో ఉన్న ప్రకృతి సిద్ధమైన లక్నవరం సరస్సు నిండుకుండలా మారింది… భారీగా వరద నీరు వస్తుండటంతో కేబుల్ బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహిస్తుంది. దాంతో కాటేజీతో పాటు రెస్టారెంట్లోకి వరద నీరు చేరింది. అత్యంత ప్రమాదకరంగా నీరు ఉప్పొంగి ఆ ప్రాంతమంతా సముద్రంలా మారింది..లక్నవరం పూర్తి సామర్థ్యం 33ఫీట్లు కాగా, ఇప్పటికే 34.5 ఫీట్లకు చేరుకుంది.. లక్నవరం వైపు వెళ్లే దారులన్నీ ముసుకుపోయాయి.. లక్నవరం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడం తో సందర్శకులను అనుమతించడం లేదు.
ఇటు రామప్ప కూడా నిండు కుండలా మారి ఉప్పొంగి ప్రవహిస్తుంది..రామప్ప బ్యాక్ వాటర్‌తో సమీపాన ఉన్న పంట పొలాలు మునిగిపోయాయి. వరద నీరు జాతీయ రహదారిపైకి చేరడంతో వరంగల్-ఏటూరునాగారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి..అదేవిధంగా మండలంలోని దయ్యాల వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. కర్లపల్లి శివారు గుండ్లవాగు ప్రాజెక్టు కూడా వర్షాలతో మత్తడి పోస్తోంది. లక్ష్మీపూర్‌లో వర్షాల వల్ల మట్టి గోడలు కూలిపోయాయి. జంగాలపల్లి వద్ద ములుగు జాతీయ రహదారిపైకి వరద నీరు భారీగా చేరుకుంది. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Also read:
Wonder Kid: చిన్నాడో కాదు.. చిచ్చర పిడుగు.. ఒక్కసారి తెలిసిందంటే ఇక అంతే..