Telangana Weather Report: నిన్న ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు దక్షిణ ఛత్తీస్ ఘడ్ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఎత్తుకు వెళ్ళే కొలదీ నైరుతిదిశ వైపునకు తిరుగుతుంది. ఋతపవనాల ద్రోణి బికనేర్, అజ్మీర్, దక్షిణ ఛత్తీస్ ఘడ్, పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం విశాఖపట్నం మీదగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది.
ఈ రోజు తూర్పు పశ్చిమ షియర్ జోన్ 15°N అక్షాంశం వెంబడి 5.8కి మీ నుంచి 7.6 కి మీ మధ్య స్థిరంగా కొనసాగుతుంది. దీని ఫలితంగా రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఈ రోజు భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని అధికారులు సూచిస్తున్నారు.