
అది వారి దాహార్తిని తీర్చే బావి.. కానీ అదే వారి పాలిట కాలయముడిగా మారుతుందని ఆ తండ్రీకొడుకులు ఊహించలేదు. ఒక మూగజీవి ప్రాణాన్ని కాపాడాలనే వారి మానవత్వం.. చివరికి వారిద్దరినీ మృత్యుఒడికి చేర్చింది. ములుగు జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన ఇప్పుడు ఊరంతా బోరుమనేలా చేస్తోంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కార్లపల్లి గ్రామంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రసపుత్ రాజు అనే రైతుకు చెందిన లేగదూడ ప్రమాదవశాత్తు వారి ఇంటి ఆవరణలోని మంచినీటి బావిలో పడిపోయింది. తన కళ్ల ముందే ప్రాణాపాయంలో ఉన్న లేగదూడను చూసి రాజు తల్లడిల్లిపోయాడు. ఎలాగైనా దాన్ని కాపాడాలని నిర్ణయించుకుని 35 అడుగుల లోతు ఉన్న ఆ బావిలోకి దిగాడు.
బావిలోకి దిగిన రాజు, తన ప్రాణాలను పణంగా పెట్టి తాడు సహాయంతో లేగదూడను సురక్షితంగా పైకి పంపాడు. అయితే దూడ ప్రాణం దక్కిన ఆ క్షణమే కాలం రాజుపై పగబట్టింది. బావి లోపల ఆక్సిజన్ అందకపోవడంతో రాజు అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పైనే ఉన్న కుమారుడు పవన్ (రక్షణ చర్యలు ఏవీ లేకుండానే) తన తండ్రిని కాపాడుకోవాలనే ఆరాటంతో వెంటనే బావిలోకి దూకాడు. దురదృష్టవశాత్తు పవన్‌కు కూడా ఊపిరి అందలేదు. కళ్లముందే తండ్రీకొడుకులు ఇద్దరూ మృత్యువుతో పోరాడుతుంటే, కాపాడలేక కుటుంబ సభ్యులు, స్థానికులు చేసిన హాహాకారాలు కార్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు నింపాయి.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎస్.డీ.ఆర్.ఎఫ్ సిబ్బంది సహాయంతో గంటల తరబడి శ్రమించి తండ్రీకొడుకుల మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకే ఇంట్లో తండ్రీకొడుకులు ఇద్దరూ మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. ఊరంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మూగజీవిని కాపాడిన ఆ చేతులే ప్రాణవిహీనంగా పడి ఉండటం చూసి గ్రామస్థులు తట్టుకోలేకపోతున్నారు. ఒక చిన్న పొరపాటు, సరైన రక్షణ చర్యలు లేకపోవడం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.