
మంచిర్యాల జిల్లా, సెప్టెంబర్ 03: మంచిర్యాల జిల్లా మందమర్రి లో దారుణం చోటు చేసుకుంది. మేకను ఎత్తుకెళ్లారనే నెపంతో ఇద్దరు యువకులను అత్యంత దారుణంంగా మేకల కొట్టంలో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి చితక బాదారు మేక యజమానులు. మేకల మండి లో నుండి రెండు మేకలను మాయం చేశారని నెపంతో మేకల కాపరితో పాటు ఆ అతని స్నేహితుడైన ఓ తాపి మేస్త్రీని విచక్షణా రహితంగా కొట్టారు. అక్కడితో ఆగకుండా కింద మంటపెట్టి చిత్రహింసలకు గురి చేశారు. మేకకు బదులిగా.. మూడు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ కర్రలతో చితక బాదారు మేకల యజమానులు. ఈ ఘటన సింగరేణి ప్రాంతంలోని మందమర్రి యాపల్ లో చోటు చేసుకోగా… ఆలస్యంగా వెలుగు చూసింది.
మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన కొమురాజుల రాములు, అతని భార్య స్వరూప, కొడుకు శ్రీనివాస్ అంగడిబజార్ ప్రాంతంలో నివాసముంటున్నారు. యాపల్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ సమీపంలో ని గంగనీళ్ల పంపుల వద్ద షెడ్డు వేసి మేకలు పెంచుతున్నారు. ఈ మండిలో తేజ (19) అనే యువకుడు పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. అతని తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది.
ఎనిమిది రోజుల కిందట షెడ్డు నుంచి ఒక మేక కనిపించకుండా పోయింది. అదే ఏరియాకు చెందిన తాపీ మేస్త్రీ శ్రావణ్ వద్ద కూలీ పనులు చేస్తున్న చిలుముల కిరణ్ అనే వ్యక్తి మేకల మండిలో పశువులకాపరిగా పని చేస్తున్న తేజతో కలిసి మేకను దొంగతనం చేశాడని ఆరోపిస్తూ శుక్రవారం ఆ ఇద్దరిని రాములు కుటుంబసభ్యులు షెడ్డు వద్దకు పిలిపించారు. మేకను మీ ఇద్దరే దొంగతనం చేశారని ఆరోపిస్తూ ఆ ఇద్దరిని అక్కడే షెడ్డులో తలకిందులుగా కట్టేసి చితక బాదారు. ఒప్పుకోవాలంటే కింద మంట పెట్టి పొగను పీల్చాలంటూ చిత్రహింసలకు గురి చేశారు.
మూడు వేల రూపాయలు చెల్లిస్తే విడిచిపెడుతామని చెప్పడంతో ఈ విషయం తెలుసుకున్న తాపీ మేస్త్రీ శ్రవన్ డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చి కిరణ్ ను విడిచిపించుకొని వెళ్లాడు. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి కిరణ్ కనిపించకుండా పోవడంతో అతని చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం మందమర్రి పోలీస్ కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో ఈ దారుణం వెలుగు చూసింది.
సోషల్ మీడియాలో యువకులను చిత్రహింసలకు గురి చేస్తూ దాడి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు మేకల యజమానులైన రాములు , స్వరూప వారి కొడుకు శ్రీనివాస్ లతో పాటు దాడికి సహకరించిన మరో ఇద్దరిపై ఎస్సీ , ఎస్టీ కేసు నమోదు చేశారు.
ఎనిమిది రోజుల క్రితం ఈ ఘటన జరుగగా.. సెప్టెంబరు 2 న వెలుగు చూసింది. తేజను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. దళిత యువకుడు కిరణ్ కనిపించకుండ పోవడం సంచలనంగా మారింది. కిరణ్ జాడ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని, కిరణ్ , తేజలపై దాడి చేసిన నిందితులను ఆదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ సదయ్య తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం