పట్టభద్రుల ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్.. ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమావేశం.. పార్టీ గెలుపుపై దిశానిర్ధేశం

త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ బై ఎలక్షన్‌తోపాటు, పట్టభద్రుల ఎన్నికలపై అధికార టీఆర్‌ఎస్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

పట్టభద్రుల ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్.. ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమావేశం.. పార్టీ గెలుపుపై దిశానిర్ధేశం
Follow us

|

Updated on: Feb 28, 2021 | 3:28 PM

Graduate mlc elections 2021 : త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ బై ఎలక్షన్‌తోపాటు, పట్టభద్రుల ఎన్నికలపై అధికార టీఆర్‌ఎస్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాలతో టీఆర్‌ఎస్‌ నాయకత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎన్నికలపై ఇంఛార్జి నేతలకు స్పష్టమైన సూచనలు చేశారు సీఎం కేసీఆర్‌.

విపక్షాలతో పాటు ఇండిపెండెంట్లు సైతం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవడంతో అధికార పార్టీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించారు సీఎం కేసీఆర్‌. హైదరాబాద్‌ జిల్లాకు గంగుల కమలాకర్‌, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జీగా హరీష్‌రావు, మహబూబ్‌నగర్‌ ఇంఛార్జీగా ప్రశాంత్‌రెడ్డిలను నియమించారు. ఇటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను సైతం పలువురు మంత్రులకు అప్పగించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికతో పాటు ఇతర రాజకీయ అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

అటు.. గ్రాడ్యుయేట్ ఎన్నికలను ఈసారి తాము సీరియస్‌గా తీసుకున్నట్టు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, వాటిని ఓట్లుగా మల్చుకోవల్సిన అవసరం తమపై ఉందన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందన్నారు. రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు.

ఇక, ఇప్పటకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఎమ్మెల్సీ బరిలో 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 93 మంది ఉన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఈ రెండు స్థానాలకు మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. మార్చి 17న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.

హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సురభి వాణీదేవి రంగంలోకి దిగారు. ఇదే స్థానం కోసం బీజేపీ నుంచి రామచంద్రరావు, కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఫ్రొపెసర్‌ నాగేశ్వర్‌ పోటీ పడుతున్నారురు. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రాములు నాయక్‌తో పాటు టీజేఎస్ అభ్యర్థిగా కోదండరాం, జయసారధి రెడ్డి, తీన్‌మార్‌ మల్లన్న, ప్రేమేందర్‌ రెడ్డి, రాణిరుద్రమ దేవి వంటి ప్రముఖులు పోటీపడుతున్నారు.

కాగా, ఈ ఎన్నికలను అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని ఇంఛార్జీ నేతలకు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అభ్యర్థి ప్రచారానికి రాకపోయినా ఇంఛార్జీ మంత్రులే గెలుపు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఎవరూ అలసత్వం వహించినా.. ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్యనేతలు హాజరయ్యారు.

ఇదీ చదవండిః Hyderabadi Biryani: 60 రూపాయలకే తిన్నంత బిర్యానీ.. ఎక్కడో తెలిస్తే మీరు కూడా వెళ్తారు..!