కళాశాలలో వండిన వంటకాలకు ఎలాంటి రక్షణ ఏర్పాటు చేయకపోవడంతో.. విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను కోతులు తింటున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డైనింగ్ హాలులోకి వెళ్లి అన్నం తినడానికి విద్యార్థులు భయపడుతున్నారు. వంట పూర్తికాగానే.. ఆహారాన్ని లోపలికి దూరి మరీ ఎత్తుకెళ్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులో ఉన్న బాబుజగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాలలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు పెట్టే భోజనం విషయంలో నిర్వాహకులు నిర్లక్ష్యవైఖరిని వ్యవహరిస్తున్నారు.
రోజూ వంటగదిలో వండి పెడుతున్న డైనింగ్ హాలులో తీసుకువచ్చి పెడుతున్న వంటకాలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని చెబుతున్నారు విద్యార్థినిలు. వండిన ఆహార పదార్థాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన మెస్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కోతులు యథేచ్ఛగా వంటశాలల్లోకి ప్రవేశించి వండిన ఆహార పదార్థాలు తింటున్నాయి. దీనిని కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వీడియో తీసీ తమ తల్లిదండ్రులు పంపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు మెస్ నిర్వాహకులపై మండి పడుతున్నారు.
కోతులు తిన్న ఆహార పదార్థాలను మెస్ నిర్వహకులు, విద్యార్థులకు పెడుతున్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గతంలో కూడా చికెన్ కర్రీలో బ్లేడ్ వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అప్పటి ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇలాంటి ఘటనలపై విద్యార్థుల తల్లిదండ్రులతో పాటూ, విద్యార్థులు కూడా ఉన్నతాధికారులకు గతంలో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా కోతులు తిన్న ఆహార పదార్థాలు విద్యార్థులకు పెడితే అనారోగ్యం పాలవుతారని సోషల్ మీడియా ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కోతుల కారణంగా.. విద్యార్థులు కడుపు నిండ అన్నం తినలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఈ కోతుల బెడద నుంచి తమను రక్షించాలని, భయం లేకుండా మెస్ హాల్ లో కూర్చొని అన్నం తినేందుకు తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..