Godavari River: భద్రాచలంలో ప్రమాదకర స్థాయికి చేరిన గోదావరి.. వానలు తగ్గినా పోటెత్తుతున్న వరద..

|

Jul 30, 2023 | 5:58 AM

Bhadrachalam News: వరద గంటగంటకూ పెరుగుతుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. ముందస్తుగా ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. రాత్రికి 60 అడుగుల వరకు చేరే అవకాశం లేకపోలేదంటున్నారు అధికారులు. దాంతో.. ప్రజా ప్రతినిధులు, అధికారులు అప్రమత్తం అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ప్రియాంక ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Godavari River: భద్రాచలంలో ప్రమాదకర స్థాయికి చేరిన గోదావరి.. వానలు తగ్గినా పోటెత్తుతున్న వరద..
Godavari River Floods
Follow us on

భద్రాద్రి కొత్తగూడె, జులై 30: భద్రాచలం దగ్గర ప్రమాదకర స్థాయికి చేరింది గోదావరి. భద్రాచలం ఎంతవరకు సేఫ్ అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటికైతే ఎలాంటి ప్రమాదకర పరిస్థితి లేదని చెప్తున్నారు మంత్రి పువ్వాడ. ప్రభుత్వం వైఫల్యమే వరదలకు మెయిన్ రీజన్ అంటూ ఆరోపిస్తున్నారు ప్రతిపక్షపార్టీ నేతలు. వానలు తగ్గినా వరద పోటెత్తుతుండటంతో భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటిమట్టం ఇప్పటికే 56 అడుగులకు చేరడంతో మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రధానంగా.. బూర్గంపాడు, సారపాకతోపాటు ఐదు మండలాలు వరదలో చిక్కుకున్నాయి. వరద గంటగంటకూ పెరుగుతుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. ముందస్తుగా ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. రాత్రికి 60 అడుగుల వరకు చేరే అవకాశం లేకపోలేదంటున్నారు అధికారులు. దాంతో.. ప్రజా ప్రతినిధులు, అధికారులు అప్రమత్తం అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ప్రియాంక ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సేవల కోసం హెలికాపర్టర్‌తోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్దంగా ఉంచారు. అలాగే.. గోదావరి పరివాహక ప్రాంతంలోని వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బూర్గంపాడు- కుక్కునూరు రహదారులపై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదిలావుంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరదల వ్యవహారం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాల పేలుతున్నాయి. భద్రాచలం దగ్గర వరద పరిస్థితిని పరిశీలించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

గతేడాది వరదల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు.. నేటికీ అమలు కాలేదన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కానీ.. జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రి మాత్రం.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక.. ప్రతిపక్ష నేతల ఆరోపణలను ఖండించారు మంత్రి పువ్వాడ అజయ్‌. గోదావరి వరదల విషయంలో ఎక్కడ వైఫల్యం చెందామో ప్రతిపక్షం చెప్పాలన్నారు. ఒక్కరోజు వచ్చి వెళ్లేవాళ్ల మాటలు పట్టించుకోవాల్సి అవసరం లేదన్నారాయన.

ఇవి కూడా చదవండి

మొత్తంగా.. రాజకీయాలు పక్కనపెడితే గోదావరి వరద ఉధృతితో భద్రాచలం పట్టణం ప్రతిసారి ముంపుకు గురవుతూ వస్తోంది. గత ఏడాది ఏకంగా 71 అడుగుల మార్క్‌ దాటడంతో దాని ప్రభావం చాలా ఊళ్లపై పడింది. వరద ముంచెత్తడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ఇప్పుడు కూడా భద్రాచలానికి మూడు వైపుల గోదారే ప్రవహిస్తుండడంతో.. భవిష్యత్‌పై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాచలం ఎంతవరకు సేఫ్‌ అన్న ప్రశ్న తలెత్తుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..