Telangana: తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులు.. వెల్లడించిన కిషన్ రెడ్డి

తెలంగాణ గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా రూ.260 కోట్లను త్వరలో విడుదల చేస్తామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లలో తెలంగాణకు గ్రామీణ స్థానిక సంస్థల కోసం రూ.11 వేల కోట్లకు పైగా కేంద్ర నిధులు అందాయని ఆయన పేర్కొన్నారు.

Telangana: తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులు.. వెల్లడించిన కిషన్ రెడ్డి
G Kishan Reddy

Updated on: Jan 14, 2026 | 3:34 PM

తెలంగాణలోని గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థలను మరింత బలపరిచే లక్ష్యంతో నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది. 2015–16 నుంచి 2019–20 మధ్యకాలంలో రూ.5,060 కోట్లను మంజూరు చేయగా, 2020–21 నుంచి 2025–26 కాలానికి నిధులను 80 శాతం పెంచి రూ.9,050 కోట్లకు కేటాయించారు. ఇందులో ఇప్పటికే రూ.6,051 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు.

గ్రామీణ స్థాయిలో ప్రజాప్రతినిధ్య సంస్థలు బలంగా ఉంటే పాలనలో బాధ్యత, పారదర్శకత పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే స్థానిక సంస్థలకు నిధులను సకాలంలో విడుదల చేస్తోందన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవడం, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వినియోగ ధృవీకరణ పత్రాలు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమర్పించడంతో, 2024–25 సంవత్సరానికి సంబంధించిన తొలి విడతగా రూ.260 కోట్లను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలిపారు. మరిన్ని యూసీలు సమర్పించిన వెంటనే మిగిలిన సుమారు రూ.2,500 కోట్లను దశలవారీగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉండాలని, ఆ ఖాతా పీఎఫ్‌ఎంఎస్ (PFMS) పోర్టల్‌లో యూనిక్ ఏజెన్సీ కోడ్‌తో నమోదు అయి ఉండాలని మంత్రి గుర్తు చేశారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేసి, ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించిందని ఆయన ఆరోపించారు. దీని వల్ల తమ పదవీకాలంలో చేసిన పనులకు డబ్బులు రాక పలువురు సర్పంచులు రాజీనామాలు చేయాల్సి వచ్చిందన్నారు. కొన్ని దురదృష్టకర ఘటనల్లో సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొంటూ, ఇది అత్యంత విచారకరమని తెలిపారు.

ఈ నేపథ్యంలో గ్రామీణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..