
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కోసం యుద్ధం నడుస్తోంది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న ఒకట్రెండు బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో రణరంగంలా మారుతోంది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల నుంచి పొలం పనుల్లో ఉన్న రైతుల వరకు అంతా ఇంధనం కోసం పడిగాపులు కాస్తున్నారు.
ముఖ్యంగా జాతీయ రహదారుల వెంట ఉన్న 90 శాతం బంకుల్లో ఇంధనం నిండుకుంది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు పలు జిల్లాల్లో వరి కోతల సమయం కావడంతో ట్రాక్టర్లు, కోత యంత్రాలకు డీజిల్ దొరకక పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చేతికొచ్చిన పంటను కాపాడుకోవడానికి రైతులు క్యాన్లతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. రద్దీ పెరగడంతో తోపులాటలు జరగకుండా బంకుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత కొన్ని గంటలుగా నెలకొన్న పెట్రోల్ సెగ క్రమంగా చల్లారుతోంది. బంకుల వద్ద నెలకొన్న రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్లు అర్ధరాత్రి వరకు పరిస్థితిని సమీక్షించి, అన్ని బంకులకు స్టాక్ చేరేలా పర్యవేక్షించారు. సాధారణం కంటే 10 శాతం అదనంగా ఇంధనాన్ని సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. అయితే, సోషల్ మీడియాలో పెట్రోల్ కొరతపై అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు అధికారులు హెచ్చరించారు.
ప్రభుత్వాలు కొరత లేదని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో దృశ్యం వేరేలా ఉంది. అధికారులు, నిపుణులు ప్రధానంగా మూడు కారణాలను విశ్లేషిస్తున్నారు. ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారంతో జనం అవసరానికి మించి నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండస్ట్రియల్, కమర్షియల్ డీజిల్ ధరలు పెరగడంతో, బల్క్ వినియోగదారులు కూడా రిటైల్ బంకుల వైపు మళ్లారు. దీనివల్ల నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయి. దీనికి తోడు ఆయిల్ కంపెనీల నుంచి రావాల్సిన కోటాలో తగ్గుదల ఉండటంతో మేనేజ్‌మెంట్ బోర్డులు చేతులెత్తేస్తున్నాయి.
సివిల్ సప్లై ఉన్నతాధికారులు స్వయంగా బంకులను సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం బంకుల వద్ద పోలీస్, రెవెన్యూ అధికారుల పహరా కొనసాగుతోంది. నేటి సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సరఫరా పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి చేరుకోనుంది. కావున ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ ఇంధన కష్టాలపై అటు ఏపీ, ఇటు తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. ప్రభుత్వాల వైఫల్యం వల్లే సామాన్యుడికి ఈ కష్టాలని ప్రతిపక్షాలు మండిపడుతుంటే, సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రభావం వల్ల తమ వద్ద రద్దీ పెరిగిందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ వాదిస్తోంది. వాదనలు ఏవైనా, తమ బతుకు బండి నడవాలంటే లీటరు ఆయిల్ పోయాలని సామాన్యుడు వేడుకుంటున్నాడు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సరఫరాను క్రమబద్ధీకరించకపోతే ఈ సంక్షోభం మరిన్ని రంగాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
మరిన్ని అంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..