Ponguleti Srinivas Reddy: శీనన్న ఏందీ కన్‌ప్యూజన్.. క్లారిటీ ఎప్పుడిస్తావ్…

Khammam: ఆర్నెళ్లు గడిచింది. అయినా మనసులో మాట బయట పెట్టలేదు. ఇంకా సాగదీస్తున్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యమంటారు. తన దారెటో మాత్రం చెప్పరు. ఒకసారి కమలనాథులతో చర్చలు జరుపుతారు.మరోసారి కాంగ్రెస్‌ నేతలతో కలుపుగోలుగా ఉంటారు. ఇంకోసారి సొంత కుంపటే బెటరనే సిగ్నల్స్‌ ఇస్తారు. అసలు ఆయన మనసులో ఏముందో.. ఏ పార్టీలో అడుగు పెడతారో అన్నది పొంగులేటి అనుచరులకు కూడా అర్థం కావడం లేదట..

Ponguleti Srinivas Reddy:  శీనన్న ఏందీ కన్‌ప్యూజన్.. క్లారిటీ ఎప్పుడిస్తావ్...
Ponguleti Srinivas Reddy

Updated on: Jun 12, 2023 | 6:01 PM

అనుచరులకు, అయినవాళ్లకు శీనన్నగా ఆప్తుడు..రాజకీయాల్లో పొంగులేటిగా పరిచయస్తుడు..పొలిటికల్ ఎనిమీస్‌కు అర్థంకాని మనిషి..ఎంత చనువున్నా..ఎవరితోనూ మనసులోమాట పంచుకోడు. ఆత్మీయ సమ్మేళనాలు ఎన్ని చేసినా..అర్థబలం..అంగబలం పుష్కలంగా ఉన్నా..బయటకు మాత్రం సౌమ్యంగా కనిపించే నిగర్వి ప్రయాణం ఇప్పుడు ఎక్కడికి..ఆయన అడుగు పెట్టే పార్టీ ఏది. స్వతహాగా కాంట్రాక్టర్‌ అయిన పొంగులేటి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిపై అభిమానంతో 2013 ఫిబ్రవరి 23న వైసీపీలో చేరారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదే సంవత్సరం ఖమ్మం లోక్‌సభ నుంచి వైసీపీ తరపున నిలబడి ఎంపీగా గెలిచారు. అయితే వైసీపీ ఏపీకి పరిమితం కావడంతో.. 2016 మే 3న సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు అప్పటి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో జరిగిన లోక్‌సభ ఎన్నికతో పాటు, ఎమ్మెల్సీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థులను గెలిపించారు.

ఏడేళ్లుగా పార్టీలో విధేయతగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడుతుంటే..కేసీఆర్‌ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆరోపణతో 2023 జనవరి నుంచి అనుచరులతో కలిసి బీఆర్ఎస్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనుచరులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. దీంతో పొంగులేటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బీఆర్‌ఎస్‌ పెద్దలు.. ఏప్రిల్‌ 10న బీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. అప్పటి నుంచీ పొంగులేటి ఏ పార్టీలో చేరతారని జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. ఎప్పుడైతే బీఆర్‌ఎస్‌ నుంచి బయటకొచ్చారో… అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా ఊహించని వ్యూహాలతో ముందుకెళ్తున్నారు.

కొంతకాలం కొత్త పార్టీ పెడతారని జోరుగా పీలర్స్‌ వచ్చాయి. ఆ తర్వాత కమలనాథులతో చర్చలు జరపడంతో..కాషాయ కండువా కప్పుకుంటారని ఊదరగొట్టారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడం కన్ఫామ్‌ అంటున్నారు. కోమటిరెడ్డి కూడా అదే చెబుతున్నారు. కానీ పొంగులేటి మాత్రం తొణకడం లేదు. ఏమాట చెప్పడం లేదు. అసలు మనసులో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..