దుర్వాసన వస్తుందని కాల్వలోకి తొంగిచూస్తే.. గుండె పగిలిపోయే సీన్! కన్నీళ్లు పెట్టించే ఘటన

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మర్‌పల్లిలో మురుగు కాల్వలో ఐదు నెలల గర్భస్థ శిశువు మృతదేహం లభించడం కలకలం రేపింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిశుద్ధ్య కార్మికులు మృతదేహాన్ని పూడ్చిపెట్టడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు అక్రమ గర్భస్రావం కోణంతో సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

దుర్వాసన వస్తుందని కాల్వలోకి తొంగిచూస్తే.. గుండె పగిలిపోయే సీన్! కన్నీళ్లు పెట్టించే ఘటన
Five Month Foetus

Edited By:

Updated on: Jul 12, 2026 | 9:11 PM

సిద్దిపేట జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. దుబ్బాక మండలం కమ్మర్‌పల్లి గ్రామంలోని మురుగు కాల్వలో ఐదు నెలల గర్భస్థ శిశువు మృతదేహం లభించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అంతేకాకుండా, ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిశుద్ధ్య కార్మికులు ఆ మృతదేహాన్ని పూడ్చిపెట్టడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని మురుగు కాల్వ ప్రాంతం నుంచి కొన్ని రోజులుగా తీవ్ర దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు పారిశుద్ధ్య కార్మికులకు సమాచారం అందించారు. వారు కాల్వను పరిశీలించగా ఐదు నెలల గర్భస్థ శిశువు మృతదేహం కనిపించింది. అయితే చట్టప్రకారం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉండగా, అలాంటి చర్యలు తీసుకోకుండా కార్మికులు శిశువు మృతదేహాన్ని రహస్యంగా పూడ్చిపెట్టినట్లు తెలిసింది.

ఈ విషయం గ్రామంలో వేగంగా వ్యాపించడంతో చివరకు పోలీసుల దృష్టికి చేరింది. సమాచారం అందుకున్న దుబ్బాక పోలీసులు వెంటనే కమ్మర్‌పల్లి గ్రామానికి చేరుకుని ఘటనపై విచారణ ప్రారంభించారు. నిబంధనల ప్రకారం ఇప్పటికే పూడ్చిపెట్టిన గర్భస్థ శిశువు మృతదేహాన్ని వెలికితీయించి, ప్రభుత్వ వైద్యుల సమక్షంలో అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన వెనుక అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ గర్భస్రావం అనంతరం శిశువు మృతదేహాన్ని కాల్వలో పడేశారా? లేక మరేదైనా పరిస్థితుల్లో ఈ ఘటన జరిగిందా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మరోవైపు, శిశువు మృతదేహం కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పూడ్చిపెట్టిన పారిశుద్ధ్య కార్మికుల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. వారు స్వచ్ఛందంగా అలా చేశారా? లేక ఎవరి ఆదేశాల మేరకు ఈ చర్యకు పాల్పడ్డారా? అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమాయక పసిప్రాణాన్ని మురుగు కాల్వలో పడేయడం, అనంతరం ఘటనను గోప్యంగా ఉంచేందుకు చేసిన ప్రయత్నం పట్ల గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంబంధిత ఆధారాలను సేకరిస్తూ, బాధ్యులను గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us