Weather Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. వచ్చే 3 రోజులు వర్షాలు పడతాయా.. లేదా..? తెలుసుకోండి..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో వేడి గాలుల కారణంగా ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోతుండగా.. మరోవైపు రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్న వాతావరణం నెలకొంది.ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ, వాయువ్య దిశల నుండి వేడి గాలులు వీస్తుండటంతో ఏపీలో ఎండల తీవ్రత పెరగనుంది. మరోవైపు తెలంగాణలో రుతుపవన ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో ప్రాంతాల వారీగా తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ – యానాం వాతావరణ సూచన:
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం
ఆదివారం ఈ ప్రాంతంలో వాతావరణం కాస్త మిశ్రమంగా ఉంటుంది. ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే చాన్స్ ఉంది. అయితే ఇదే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈక గాలులు వీస్తాయి. ఒకటి లేదా రెండు చోట్ల తీవ్రమైన వడగాలులు వీచే ప్రమాదం ఉంది. సోమ, మంగళవారాల్లో వర్షాలు తగ్గి పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడుతుంది. ఎండల తీవ్రత పెరగడంతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, ఒకటి లేదా రెండు చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్
ఈ ప్రాంతంలో రాబోయే మూడు రోజుల పాటు పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుంది. ఎండలు మండిపోనున్నాయి. ఈరోజు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో రేపు, ఎల్లుండి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. తీర ప్రాంత వాసులు వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
రాయలసీమ
రాయలసీమ వ్యాప్తంగా ఎలాంటి వర్ష సూచన లేదు. పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. అయితే ఉపరితల గాలులు బలంగా వీచనున్నాయి. ఈరోజు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో రాబోయే రెండు రోజులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
తెలంగాణ వాతావరణ సూచన
ప్రస్తుతం రుతుపవన ద్రోణి సగటు సముద్రమట్టం వద్ద శ్రీ గంగానగర్, హిస్సార్, మీరట్, గోరఖ్‌పూర్ మీదుగా దక్షిణ అస్సాం వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, ఈశాన్య జిల్లాలలో ఉపరితల గాలులు అత్యంత బలంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రమాదం ఉంది. మధ్య, దక్షిణ తెలంగాణ ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.
