Telangana: కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత.. తీవ్రరూపం దాల్చిన రైతుల ఆందోళనలు.. స్పందించిన మంత్రి కేటీఆర్..

|

Jan 05, 2023 | 3:38 PM

కామారెడ్డి కలెక్టరేట్‌ దగ్గర టెన్షన్‌ కొనసాగుతోంది. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. బారికేడ్లను దూసుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Telangana: కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత.. తీవ్రరూపం దాల్చిన రైతుల ఆందోళనలు.. స్పందించిన మంత్రి కేటీఆర్..
Kamareddy
Follow us on

కామారెడ్డి కలెక్టరేట్‌ దగ్గర టెన్షన్‌ కొనసాగుతోంది. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. బారికేడ్లను దూసుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్‌లో విలీనమయ్యే గ్రామాల రైతులు.. కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చి.. మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. పోలీస్‌ బారికేడ్లను కూడా పక్కకు నెట్టి కలెక్టరేట్‌ ముట్టడించారు. రైతు గోస వినండి సారూ అంటూ నినాదాలు చేస్తున్నారు.

మాస్టర్‌ప్లాన్‌లో భూమి పోతుందనే ఆవేదనతో నిన్న రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. రైతు ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆందోళనలకు దిగారు. భారీ ర్యాలీగా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. కామారెడ్డి నూతన మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. అడ్లూర్ సర్పంచ్ జనార్థన్‌పై రైతులు దాడికి పాల్పడ్డారు. సర్పంచ్ రాజీనామా చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, గ్రామస్తులు ఆయనపై దాడి చేశారు. తన మాట వినకుండా దాడి చేశారని, భూములు పోవని ఎమ్మెల్యే మాట ఇచ్చారని సర్పంచ్ జనార్థన్ చెబుతున్నారు. మరోవైపు అడ్లూర్ ఎల్లారెడ్డి పాలకవర్గం రాజీనామా చేసింది. ఉపసర్పంచ్ సహా 9 మంది వార్డు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు.

ఇవి కూడా చదవండి

మంత్రి కేటీఆర్ స్పందన..

కామారెడ్డి రైతుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇండస్ట్రియల్ జోన్‌పై ఆందోళన చేస్తున్న రైతుల సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ చేంజ్‌లో ఉందని.. ఈ విషయాన్ని రైతులకు ఎందుకు వివరించలేకపోయారని అధికారులను ప్రశ్నించారు మంత్రి. ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని చెప్పాలని సూచించారు కేటీఆర్. ప్రజలకు సహాయం చేసేందుకే ప్రభుత్వం ఉందని, పట్టణాభివృద్ధి కోసమే మాస్టర్ ప్లాన్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

బీజేపీ ఎమ్మెల్యే ఫైర్..

కాగా, కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. 2014 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఇండస్ట్రియల్ జోన్ భూములను రెసిడెన్షియల్‌ జోన్‌లుగా మార్చారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..