Telangana: కష్టం అయితాందీ అన్నా ఏ సారూ పట్టించుకోలే.. దీంతో ఆ రైతే ఇంజనీర్ అయిండు

| Edited By: Ram Naramaneni

Sep 13, 2024 | 6:36 PM

అతడో సాధారణ రైతు. వానాకాలం వచ్చిందంటే తన పొలానికి వెళ్లడం ఎంతో కష్టం. ఎందుకంటే.. మధ్యలో ఓ వాగు పొంగి పొర్లుతుంది. తనతో పాటు ఆ చుట్టుపక్కల రైతులవీ ఇవే కష్టాలు. దీంతో తనకు వచ్చిన ఓ ఆలోచనను ఆచరణలో పెట్టారు కమ్మరి రాములు.

Telangana: కష్టం అయితాందీ అన్నా ఏ సారూ పట్టించుకోలే.. దీంతో ఆ రైతే ఇంజనీర్ అయిండు
Bridge
Follow us on

ఆయన ఓ సాధారణ రైతు. వానాకాలం వచ్చిందంటే తన పొలానికి వెళ్లాడానికి మినీ యుద్దమే చేయాలి. తోటి రైతుల పరిస్థితి కూడా అంతే. పొంగి పొర్లే..  వాగు అవతల పొలాలకు వెళ్ళాలంటే కష్టపడాల్సిందే. వంతెన నిర్మాణానికి అధికారులు, పాలకులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో రైతే ఇంజనీర్‌గా మారి వంతెన కలను సుసాధ్యం చేశారు.

వివరాల్లోకి వెళ్తే..  మెదక్ జిల్లా టెక్మాల్ మండలం బొడ్మాట్ పల్లి నుండి పలు గ్రామాల మీదుగా గుండువాగు ప్రవహిస్తుంది. ఉమ్మడి అల్లదుర్గం టేక్మాల్ మండలాల్లో కురిసిన వాన నీరంతా టెక్మాల్ శివారు ఎలకుర్తి మీదుగా వెళ్లే గుండువాగు పారుతుంది. వాగు అవుతలి వైపు 200 ఎకరాల వరకు పొలాలు ఉంటాయి. వానాకాలంలో వరద వస్తే అక్కడికి వెళ్లేందుకు సాధ్యం కాని పరిస్థితులు నెలకొంటాయి. దీనికి విరుగుడుగా టెక్నాల్‌కు చెందిన రైతు కమ్మరి రాములు ఉపాయాన్ని కనుగొన్నారు. సొంతంగా గుండువాగుపై వంతెన నిర్మాణానికి పూనుకున్నారు. ఆయనకు అదే ప్రాంతంలో 15 ఎకరాల పొలం ఉంది. వరి, పత్తి పంటలు సాగు చేసేవారు. వరద వచ్చినప్పుడల్లా పొలానికి వెళ్ళలేక ఇబ్బందులు పడ్డారు. దీంతో తనకు వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టారు. వాగు సమీపంలో వంతెన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. దీనికి రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అనుకున్నదే తడువుగా వంతెన పనులు ప్రారంభించారు. నెల రోజులకు ముందు గుండువాగులో నీళ్ళు లేని సమయంలో పెద్ద స్తంభాలను పిల్లర్లుగా ఏర్పాటు చేశారు. వాటికి ఇనుప రాడ్లను బిగించి వంతెన తరహాలో తయారు చేశారు. అదే ప్రాంతానికి చెందిన ప్రభాకర్ శర్మ రాములుకు 30 వేల రూపాయలు సహకారం అందించారు. ఇప్పుడు సులభంగా అవుతలి వైపు వెళ్లేందుకు వంతెన తయారైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుండువాగు పొంగినప్పుడు దీని మీదుగానే ఇక్కడి రైతులు వెళ్లి తమ వ్యవసాయ పనులు కొనసాగించారు. అనుకున్న విధంగా వంతెన నిర్మించిగా.. త్వరలో దానిపై షీట్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దాంతో పలు గ్రామాల ప్రజలు రాములును అభినందిస్తున్నారు. పాలకులు చేయలేని పనిని అతను చేయడంపై రైతులంతా మెచ్చుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..