Hyderabad: గ్రాఫిక్ డిజైనర్ దొంగ తెలివితేటలు.. రెడ్ హ్యాండ్‌గా దొరికిపోయాడు..!

గ్రాఫిక్‌ డిజైనర్‌... నకిలీ నోట్ల క్రియేటర్‌గా మారాడు. డబ్బు సంపాదించలేక... సృష్టిస్తున్నాడు. తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బును సంపాదించాలన్న ఆశతో నకిలీ నోట్ల తయారీని వృత్తిగా మలుచుకున్నాడు. ఒకటి రెండు సార్లు ఫెయిలై... ఎట్టకేలకు రియల్‌ కరెన్సీకి ఏమాత్రం తీసిపోకుండా నోట్లు ప్రింట్‌ చేస్తున్నాడు. ఫర్జీ వెబ్ సిరీస్‌ని తలపించే ఫేక్‌ దందాను పక్కా ప్లానింగ్‌తో బ్రేక్‌ చేశారు పోలీసులు.

Hyderabad: గ్రాఫిక్ డిజైనర్ దొంగ తెలివితేటలు.. రెడ్ హ్యాండ్‌గా దొరికిపోయాడు..!
Fake Indian currency racket busted in Hyderabad

Edited By:

Updated on: Jan 25, 2025 | 8:28 AM

హైదరాబాద్, 25 జనవరి 2025: రియల్‌ కరెన్సీ నోట్లకు ఏమాత్రం తీసిపోకుండా అచ్చుగుద్దినట్లు నకిలీ నోట్లు తయారుచేస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. నిందితుడి నుంచి 5 లక్షల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఈ నకిలీ దందా సాగుతున్నట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే..

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అమరచింతకు చెందిన నవీన్‌ కుమార్‌… సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లమా పూర్తి చేశాడు. ఆ తరువాత మల్టీమీడియాలో డిప్లమా చేసి గ్రాఫిక్‌ డిజైన్‌, వెబ్‌ డిజైన్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఉద్యోగాలు చేశాడు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఉబర్‌, ర్యాపిడోలోనూ డ్రైవర్‌గా పనిచేశాడు. అప్పటికీ అనుకున్న ఆదాయం రాకపోవడంతో అక్రమ దందాలతోనే ఈజీ మనీ సంపాదించవచ్చని ప్లాన్‌ చేశాడు. అందులోభాగంగానే నకిలీ కరెన్సీని తయారు చేసే విధానంపై ఫోకస్‌ పెట్టాడు నవీన్‌.

తనకున్న మల్టీమీడియా నాలెడ్జ్‌తో ఫేక్‌ కరెన్సీ నోట్లను ప్రింట్‌ చేశాడు నవీన్. వాటి రివ్యూ కోసం తన మిత్రులకు పంపాడు. అయితే నకిలీ నోట్లని ఈజీగా కనిపెట్టేలా ఉన్నాయంటూ ఫ్రెండ్స్‌ నుంచి నెగిటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. అయినప్పటికీ ఒకటి, రెండుసార్లు ప్రయత్నించి ఫెయిల్‌ అయ్యాడు. ఇంతలో కోల్‌కతాకు చెందిన ఒక వ్యక్తి నవీన్‌ను పరిచయమయ్యాడు. అతని పరిచయంతో కోల్‌కతా వెళ్లి ట్రైనింగ్‌ తీసుకున్నాడు నవీన్. ఇంతలో నోట్ల తయరీ ముఠాలతో సంబంధాలున్న గుజరాత్‌కు చెందిన మరో వ్యక్తి నవీన్‌కు జతకలిశాడు. ఇక ముగ్గురూ ముఠాగా ఏర్పడి భారీగా 500 నోట్లను ముద్రించడం స్టార్ట్‌ చేశారు. లక్ష నకిలీ నోట్లకు 10వేల రూపాయల కమీషన్‌ తీసుకుంటూ దందా సాగించారు. అతి తక్కువ సమయంలోనే 5 లక్షల రూపాయల విలువచేసే నకిలీ నోట్లను తయారుచేశారు. తయారుచేసిన ఆ నోట్లను ఓ ఏజెంట్‌కు ఇచ్చేందుకు వెళ్లి దొరికిపోయాడు. పక్కాప్లాన్‌ ప్రకారం నవీన్‌ను పట్టుకున్నారు పోలీసులు. పెద్ద ఎత్తున మెషినరీని సీజ్‌ చేశారు.

నిందితుడి దగ్గరి నుంచి రూ.5 లక్షల విలువ చేసే రూ.500 నకిలీ కరెన్సీ నోట్లు, దీన్ని ముద్రించేందుకు వాడిన పరికరాలను పోలీసులు సీజ్ చేశారు. మొత్తంగా… ఈ కేసులో లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులు… త్వరలోనే ముఠాలో ఉన్న అందరిని పట్టుకుంటామంటున్నారు.