చదువుతో సంబంధం లేకుండా అడ్డదారిలో డాక్టర్ అయ్యి.. వైద్యం అందిస్తున్న వ్యక్తుల గురించి సినిమాల్లో తరచుగా చూస్తూనే ఉంటాం.. అయితే ఇలా రియల్ గా అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఓ నకిలీడాక్టర్ గుట్టు రట్టయింది. ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా పదేళ్లుగా డాక్టర్‌గా చెలామణి అవుతున్న నకిలీ వైద్యుని అసలురంగు బయటపెట్టారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన ఆకాశ్‌కుమార్ బిశ్వాస్ పదో తరగతి కూడా పాస్ కాలేదు. కొంతకాలం తన తాత వద్ద ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్నాడు. అదే అర్హతగా జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ మండలం శివునిపల్లిలో ఐఏఎమ్ పేరుతో ఓ క్లినిక్ ఓపెన్ చేశాడు. ‘ఇండియన్ ఆయుర్వేదిక్ మెడిసిన్’ పేరుతో బోర్డు పెట్టుకుని.. రోగులకు అల్లోపతి, ఆయుర్వేద మందులతో వైద్యం చేయడం మొదలుపెట్టాడు. ఇతని వైద్యంతో రోగులకు నయం కాకపోతే వారిని వరంగల్‌లోని పలు ఆస్పత్రులకు వెళ్లాల్సిందిగా సూచించేవాడు. అలా రోగులను ఆయా ఆస్పత్రులకు పంపించినందుకు ఆస్పత్రులనుంచి కమిషన్ తీసుకునేవాడు.
ఈక్రమంలో నకిలీ డాక్టర్ గురించి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. పక్కా ప్లాన్‌తో నవంబరు 21న బిశ్వాస్ క్లినిక్‌లో తనిఖీలు చేశారు. అతనివద్ద తగిన వైద్యానికి సంబంధించి తగిన విద్యార్హతగాని, క్లినిక్ నిర్వహణకు సంబంధించిన అనుమతిపత్రాలు కాని లేనట్లు గుర్తించారు. వివిధ పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. కాగా పదేళ్లలో అతను 3,650 మందికి పైగా రోగులకు చికిత్సలు అందించినట్లు పోలీసులు వెల్లడించారు. నకిలీ వైద్యుడిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ అభినందించారు.
మరిన్ని తెలంగాణలోని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..