–నకిలీల బాబాలు… వాళ్ల లీలలు. సబ్జెక్ట్ పాతదే. కానీ క్యారెక్టరే కొత్తది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఒక నకిలీ స్వామి బాగోతం ఇది. సామాన్యుల ఆశల్ని..అవసరాల్ని.. చివరకు ఆపదలను..అనారోగ్య సమస్యలను అలుసుగా చేసుకొని చెలరేగే ఛూ మంతర్‌గాళ్లలో ఇదిగో ఇతను ఏక్ నెంబర్ కేడీ. క్షుద్రపూజల పేరుతో మహిళల్ని లోబర్చుకోవడం.. అ తర్వాత వేధించడం…! ఇదే అభియోగంతో తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గరకు తీసుకొచ్చి చితకబాదేశారు మహిళలు.
–హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ ఈ స్వామీజీని ఆశ్రయించింది. తాయత్తులు కట్టి లోబర్చుకొని… ఆ తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడ్డాడని, డబ్బులు డిమాండ్ చేశాడని ఆరోపిస్తున్నారు మహిళలు. ఎదురుకట్ల యాకయ్య అలియాస్ శ్రీనివాస్… మఫ్టీలో ఉంటే ఇలా… డ్యూటీలో దిగితే అలా..! ఊరికో వేషం మార్చి.. కాషాయం ముసుగులో మందిని మోసగించడమే ఇతగాడి పని. పాపం పండిందో ఏమో.. ఇలా రోడ్డుమీద ఊరేగింపు జరిగిందతడికి.
–న్యూడ్ వీడియోలు, ఫోటోలు తీసి ఇంకెందరు మహిళల్ని వేధించాడు అంటూ… ఆగ్రహించిన ఆ ఊరి మహిళలు, స్వామీజీని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మీరు చంపుతారా… మమ్మల్ని చంపెయ్యమంటారా అనే స్థాయిలో ఉంది అక్కడి మహిళల ఆగ్రహం. టెక్నాలజీ ఎంత పెరిగినా మూఢ నమ్మకాలతో మోసపోతూనే ఉన్నారు కొందరు. తమ మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు ఫేక్ బాబాలు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..