
చేయూత పింఛన్లు పొందే వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు వేలిముద్ర సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అధికారులు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. పింఛన్ తీసుకునే సమయంలో ఇకపై వేలిముద్రపై ఆధారపడకుండా ముఖ గుర్తింపు యాప్ ద్వారా ధృవీకరణ చేయడం ప్రారంభించారు. వయస్సు ఎక్కువగా ఉండడం, ఆరోగ్య సమస్యలు, చర్మ సంబంధిత ఇబ్బందుల కారణంగా చాలామంది లబ్ధిదారులకు వేలిముద్ర స్కాన్ అవడం కష్టమవుతోంది. వేలిముద్ర తిరస్కరించబడితే ఆధార్ కేంద్రాలకు వెళ్లి అప్‌డేట్ చేయించుకోవాల్సి రావడం వృద్ధులకు పెద్ద ఇబ్బంది. ఈ పరిస్థితిని మార్చేందుకే అధికారులవి కొత్త చర్యలు ప్రారంభించారు. మేడ్చల్ జిల్లాలో మొత్తం 2.67 లక్షల మంది పింఛన్‌దారుల్లో పెద్ద సంఖ్యలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు. వీరిలో చాలామంది బ్యాంకులు లేదా తపాలా కార్యాలయాలకు రాలేని పరిస్థితుల్లో ఉండడంతో సెర్ప్ సిబ్బంది నేరుగా వారి ఇళ్లకే వెళ్లి ముఖ గుర్తింపు ప్రక్రియను పూర్తిచేస్తున్నారు. బ్యాంకులకు వచ్చే లబ్ధిదారుల గుర్తింపును కూడా ఇదే యాప్ ద్వారా త్వరగా పూర్తి చేస్తున్నారు.
ముఖ గుర్తింపు ద్వారా ధృవీకరించిన సమాచారం సంబంధిత శాఖలకు పంపించేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో పింఛన్ చెల్లింపులు ఆలస్యం కాకుండా సులభంగా పూర్తవుతున్నాయి. సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, ఈ విధానం లబ్ధిదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుందని మేడ్చల్ అదనపు కలెక్టర్ రాధికా గుప్త చెప్పారు. కాగా త్వరలోనే ఈ పద్ధతిని మొత్తం రాష్ట్రంలో అమలు చేయాలనే ప్రణాళిక ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.