తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు దిగారు. కింది స్థాయి కార్మికుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిక ప్రాంతాల్లో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ చర్యలను నిలిపివేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ ప్రవేశపెట్టింది. ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని తెలంగాణ విద్యుత్ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యుత్ రంగంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. నాగార్జునసాగర్ జెన్‌కో కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. వరంగల్‌లో విధులు బహిష్కరించి చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) వద్ద ధర్నా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్మికుల నుంచి ఉన్నత అధికారుల వరకు నిరసనలో పాల్గొన్నారు. జగిత్యాల విద్యుత్ ఐకాస ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. నిర్మల్ విద్యుత్ కార్యాలయం వద్ద ఉద్యోగులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అదానీ, అంబానీలకు విద్యుత్ రంగాన్ని కట్టబెట్టడానికే ఈ ప్రైవేట్ బిల్లును కేంద్రం తీసుకొస్తోందని ఉద్యోగులు ఆరోపించారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకొస్తుంటే.. కేంద్రం మాత్రం రాష్ట్రాల హక్కులను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.
Also Read: