Etela Rajender: రాబోయే కాలంలో పేదరికం పోవడానికి, ఉద్యోగాలు రావడానికి మంచి ప్రణాళికలు రూపొందిస్తామని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజా దీవెన యాత్రలో భాగంగా బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శంబునిపల్లి, ధర్మరం, శాయంపేట గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. ఆయనకు హుజురాబాద్ ప్రజలు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారని అన్నారు. నన్ను చెడిపేందుకు కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ నుంచి వందలాది మందిని బయటకు పంపించాడని, అలాగే నన్ను కూడా బయటకు పంపించాలని అనుకున్నాడని దుయ్యబట్టారు. దళిత బంధు పేరిట సీఎం కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నికక ఏసీఆర్ అహంకారానికి, దానిని ఎదుర్కొనేందుకు తనకు మధ్య పోరు అని ఈటల అన్నారు. కాగా, ఈ ప్రజా దీవెన యాత్రలో భాగంగా ఈట రాజేందర్ పదో రోజు కొనసాగింది. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలంటూ ఆయన పిలుపునిచ్చారు.