Uppal Bhagayath: కాసులు కురిపిస్తున్న ఉప్పల్‌ భగాయత్‌ భూములు.. వేలంలో భారీ ధరలు పలుకుతున్న ప్లాట్లు..!

|

Dec 03, 2021 | 3:59 PM

Uppal Bhagayath: రోజులు పెరిగే కొద్ది భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఉప్పల్‌ భగాయత్‌ భూముల వేలంలో ప్లాట్ల ధరలు భారీగా పలుకుతున్నాయి. మూడో..

Uppal Bhagayath: కాసులు కురిపిస్తున్న ఉప్పల్‌ భగాయత్‌ భూములు.. వేలంలో భారీ ధరలు పలుకుతున్న ప్లాట్లు..!
Follow us on

Uppal Bhagayath: రోజులు పెరిగే కొద్ది భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఉప్పల్‌ భగాయత్‌ భూముల వేలంలో ప్లాట్ల ధరలు భారీగా పలుకుతున్నాయి. మూడో దశ వేలంలో రెండు ప్లాట్లు రికార్డు స్థాయిలో పలికాయి. చదరపు గజం రూ. 1.01 లక్ష పలకడంతో భూముల ధరలకు ఏ మేరకు రెక్కలు వచ్చాయో తెలిసిపోతుంది. నిన్న వేలం మొదలుకాగా, మొదటి రోజు 23 ప్లాట్లుకు జరిగిన వేలంలో మొత్తం 141.6 కోట్లు వచ్చాయి. శుక్రవారం రెండో రోజు మిగిలిన 21 ప్లాట్లకు వేలం కొనసాగించనుంది హెచ్‌ఎండీఏ.

ఉప్పల్‌ భగాయత్‌ భూముల స్పెషల్‌..

ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఉప్పల్‌ భగాయత్‌లో రైతుల నుంచి 733 ఎకరాలను సేకరించిన హెచ్‌ఎండీఏ..
మెట్రో రైలుకు 104 ఎకరాలు, ఇతర సంస్థలకు కొంత కేటాయించింది. 400 ఎకరాల్లో మొదటి దశలో భారీ లేఅవుట్‌ అభివృద్ధి చేసింది. ఇందులోనే భూములిచ్చిన రైతులకు పరిహారంగా కొన్ని ప్లాట్లను కేటాయించింది.
రెండో దశ లేఅవుట్‌ను మరో 70 ఎకరాల్లో అభివృద్ధి చేసి.. మొదటిసారి 2019 ఏప్రిల్‌లో 67ప్లాట్లను, డిసెంబర్‌లో 124ప్లాట్లను వేలం వేస్తే 1050 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇవి పోగా మిగిలిన కొంత స్థలాన్ని లేఅవుట్‌గా మార్చి ప్రస్తుతం విక్రయిస్తున్నారు.

ప్రస్తుతం 44 ప్లాట్లు వేలానికి..

ప్రస్తుతం 44 ప్లాట్లను వేలానికి ఉంచారు. వేలం వేస్తోన్న 44 ప్లాట్లలో 150 నుంచి 300 గజాల వరకు ఉన్న రెసిడెన్షియల్‌ ప్లాట్లు 21 వరకు ఉండగా,
మిగతావి మల్టీపర్పస్‌ ప్లాట్లు ఉన్నాయి. గతంలో నిర్వహించిన వేలంలో అత్యధికంగా 79 వేలు, కనిష్టంగా 30 వేల వరకు ధర పలికింది. తాజాగా నిన్న నిర్వహించిన వేలంలో కనిష్టంగా 53 వేలు, గరిష్టంగా 1.01 లక్షలు పలికాయి. ఈ రోజు కొనసాగనున్న వేలంలో మల్టీ పర్పస్‌ జోన్‌కి కేటాయించిన 10 భారీ ప్లాట్లు ఉండటంతో మరింత ధర పలుకుతాయని హెచ్‌ఎండీఏ భావిస్తోంది.

కలిసొస్తున్న విక్రయాలు…

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థకు భూముల విక్రయాలు బాగా కలిసొస్తున్నాయి. 2018 ఏప్రిల్‌ వేలంలో అత్యధికంగా అత్తాపూర్‌లో చ.గజం 1.53 లక్షలు పలికింది. మొత్తం ఆదాయం- 350 కోట్లు. మాదాపూర్‌లో గజం 1.52 లక్షలు, షేక్‌పేట్‌లో 1.20 లక్షలు పలికింది. మొత్తం ఆదాయం – 300 కోట్లు. 2007లో కోకాపేట్‌లో ‘గోల్డ్‌ మైల్‌’ పేరిట అభివృద్ధి చేసిన లేఅవుట్లో 167 ఎకరాలను అమ్మితే 1753 కోట్ల ఆదాయం సమకూరింది. 2021 జూలైలో…‘నియో పోలీస్‌’ పేరిట కోకాపేటలో మరో లేఅవుట్‌ను అభివృద్ధి చేసి 49.94 ఎకరాలకు ఈ-వేలం నిర్వహించగా 2వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇక కోకాపేట భూములు గరిష్టంగా ఎకరం 60.2 కోట్లు పలికి సంచలనం సృష్టించాయి.