Hyderabad Drugs: సిటీలో ఎక్కడ చూసినా డ్రగ్స్ కంపే..! మత్తులో చిత్తవుతున్న యువత..!

| Edited By: Balaraju Goud

Jul 27, 2024 | 9:37 AM

మత్తును చిత్తు చేద్దాం.. డ్రగ్స్ రహిత తెలంగాణను సాధిద్ధాం. ఈ స్లోగన్‌తో ఓవైపు యుద్ధం చేస్తుంటే.. మరోవైపు మత్తు ముఠాలు హద్దులు లేకుండా ప్రవర్తిస్తున్నాయి. ఎంతలా నిఘా పెట్టినా... ఎన్ని వార్నింగ్‌లు ఇస్తున్నా... ఎన్ని కేసులు పెడుతున్నా.. చివరాఖరకు చిప్ప కూడు పెడుతున్నా సరే.. కొందరి ప్రవర్తన మారడం లేదు.

Hyderabad Drugs: సిటీలో ఎక్కడ చూసినా డ్రగ్స్ కంపే..! మత్తులో చిత్తవుతున్న యువత..!
Drugs
Follow us on

మత్తును చిత్తు చేద్దాం.. డ్రగ్స్ రహిత తెలంగాణను సాధిద్ధాం. ఈ స్లోగన్‌తో ఓవైపు యుద్ధం చేస్తుంటే.. మరోవైపు మత్తు ముఠాలు హద్దులు లేకుండా ప్రవర్తిస్తున్నాయి. ఎంతలా నిఘా పెట్టినా… ఎన్ని వార్నింగ్‌లు ఇస్తున్నా… ఎన్ని కేసులు పెడుతున్నా.. చివరాఖరకు చిప్ప కూడు పెడుతున్నా సరే.. కొందరి ప్రవర్తన మారడం లేదు. భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టినట్టుగా బరితెగిస్తున్నారు డ్రగ్ పెడ్లర్లు.. కన్జుమర్లు. మత్తుకి బానిసగా మారిన యువతను టార్గెట్‌ చేసుకుంటున్న మాఫియా.. విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది.

డ్రగ్స్‌ ఏ రూపంలో ఉన్నా నేరమే. మత్తు మందు తీసుకున్నా.. తమ దగ్గర ఉంచుకున్నా.. అమ్మినా.. రవాణా చేసినా.. గంజాయి, ఓపియం, కోకా పెంచినా.. పదేళ్ల వరకు జైలు శిక్షలు ఉన్నాయి. కేసు ఫైల్‌ అయితే.. బయటపడడం అనేదే ఉండదు. ఒక విధంగా జీవితం నాశనం అయినట్టే లెక్క. అయినా సరే.. డ్రగ్స్‌ మత్తులో మునిగి తేలుతున్నారు, అమ్మేవాళ్లు అమ్ముతూనే ఉన్నారు. హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. విద్యాసంస్థలు, ఐటీ జోన్, ఫిలిం ఇండస్ట్రీ ఇలా అన్ని చోట్ల డ్రగ్స్ లింక్స్ బయటపడుతున్నాయి. ఆదాయం ఎక్కువగా ఉండటంతో.. డ్రగ్ సరఫరా ముఠాలు అస్సలు వెనకాడటం లేదు. పోలీసులు దాడులు చేస్తున్నా… వెరవకుండా డ్రగ్స్ దందాలకు తెర తీస్తున్నారు. మొన్నటివరకు పబ్స్ మాత్రమే అనుకుంటూ ఉండగా.. రేవ్‌ పార్టీలు సైతం డ్రగ్స్‌కు అడ్డాలుగా మారాయి. సిటీకి దూరంగా ఉండే ఫామ్‌హౌజ్‌లే అడ్డాగా ఈ మధ్య ముజ్రా పార్టీలు కూడా జరుగుతున్నాయి. అక్కడ డ్రగ్స్ వినియోగం అనివార్యంగా మారింది. ఇక గేటెడ్ కమ్యూనిటిస్, అపార్ట్‌మెంట్స్‌లోనూ డ్రగ్స్ వినియోగం జరుగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇంకా గంజాయి రవాణా, వినియోగం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చెక్ పోస్ట్స్ దగ్గర తనిఖీలు చేస్తుంటే.. రోజూ గంజాయి వాసన గుప్పున కొడుతోంది. అవి మాత్రమే కాదు. ఇక విద్యాసంస్థల్లోనూ డ్రగ్స్ ఆనవాళ్లు ఆందోళన రేపుతున్నాయి. కొందరు కాలేజీ బాటలో పెడతోవ పట్టి గంజాయికీ, డ్రగ్స్‌కూ బానిసలైతే.. ఎందరో బ్రిలియంట్‌ స్టూడెంట్స్ మత్తు ఊబిలో చిక్కి భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. గంజాయి లాంటి చవకైన మాదకద్రవ్యమైనా.. ఇంటర్నేషనల్ మార్కెట్లో దొరికే ఖరీదైన మత్తు పదార్ఱమైనా.. ఇవన్నీ సైకో యాక్టివ్ డ్రగ్సే. మనిషిని ఉత్తేజపరిచి.. ఉన్మాదిగా మారుస్తాయి. సేవించగానే మనిషి తీరులో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. తర్వాత కూడా నడక-నడత-మాట అన్నీ తేడా కొడతాయి. డ్రగ్ అడిక్టా కాదా అని ఇట్టే తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పేరెంట్స్ తమ పిల్లల్ని ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

బహుశా.. ఇంకా పాత రోజులు అనుకుంటున్నారేమో.. డ్రగ్స్ తీసుకున్నా తెలియదనుకున్నారో గానీ.. విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అయితే.. టీజీన్యాబ్‌ రోజురోజుకూ అప్‌డేట్‌ అవుతోంది. నగరానికి డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు అమ్ముతున్నారు, ఎక్కడెక్కడ సప్లై జరుగుతోందన్న ఇన్ఫర్మేషన్‌ మొత్తం స్మార్ట్‌గా సేకరిస్తూ రైడ్స్‌ చేస్తున్నారు. గంజాయి, మెథ్, కొకైన్.. ఇలా ఏది తీసుకున్నా.. నిమిషాల వ్యవధిలో ఆ కేటగిరీతో సహా బయటపడే సరికొత్త టెక్నాలజీని కూడా అందుబాటులోకి తెచ్చారు. స్నిఫర్‌ డాగ్స్‌కు డ్రగ్స్‌ను గుర్తుపట్టేలా ట్రైనింగ్‌ ఇచ్చి మరీ.. మత్తు పదార్థాలను పట్టుకుంటున్నారు. సో, దొంగ ఎవరైనా తప్పించుకునే చాన్సే లేదు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..