Mulugu District TRS party: రాష్ట్రమంతా టీఆర్‌ఎస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తుంటే, ములుగు జిల్లాలో మాత్రం ఆత్మగౌరవం కోసం తపిస్తున్నారు గులాబీ కార్యకర్తలు. ఏకంగా మంత్రిపై గుర్రుగా ఉన్న నేతలు.. సీక్రెట్ మీటింగ్ పెట్టుకుని సంచల నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఇతర పార్టీల నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీలో అయినా నిరసన గళాలు కామనే. కానీ, ఇప్పుడు ములుగులో ఏ ఎన్నికలు లేకున్నా, రెబల్ వాయిస్‌లు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ములుగు జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ముసలం మరింత ముదిరింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ నేతలు ఇన్‌చార్జి మంత్రి సత్యవతి రాథోడ్‌కి వ్యతిరేకంగా సమావేశమవడం, చర్చనీయాంశమైంది. దళితబంధు లబ్ధిదారుల ఎంపికతో అసమ్మతి రేగినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చెప్పినవారిని ఎంపిక చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కారు పార్టీ కార్యకర్తలు.
మంత్రికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని టీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తాడ్వాయిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో పార్టీ కోసం పనిచేసిన వారికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్తలను పక్కనబెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలను ఎంపిక చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమ ఆత్మగౌరం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వైఖరికి నిరసనగా రాజీనామాలకు సిద్ధమయ్యారు. దళితబంధు లబ్ధిదారుల జాబితాను సవరించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని, లేకుంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి రాసిన లేఖల్లో స్పష్టం చేశారు తాడ్వాయి లీడర్లు.
Read Also… Chevireddy: చెవిరెడ్డికి కేబినెట్‌లో ఛాన్స్ లేనట్టే.. ఆయన ఆశించిన పదవి కట్టబెట్టిన సీఎం వైఎస్ జగన్