
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్తు డిమాండ్ పెరగడంతో, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అభివృద్ధి చర్యలు, పారిశ్రామిక విస్తరణ నేపథ్యంలో విద్యుత్తు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో దీన్ని ముందుగానే అంచనా వేసి ప్రణాళికలు రూపొందించాలన్నారు.
పెట్టుబడులు వెల్లువెత్తిన నేపథ్యం
తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగం, గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాజెక్టులు (మెట్రో, ఎలక్ట్రిక్ వెహికిల్స్) వృద్ధి చెందుతున్నందున, విద్యుత్తు అవసరాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. ఇందుకోసం పునరుత్పాదక విద్యుత్తుపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.
విద్యుత్తు డిమాండ్ పెరుగుదల – గణాంకాలు
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్తు డిమాండ్ 9.8 శాతం పెరిగింది. 2024లో అత్యధికంగా 17,162 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. 2025–26 నాటికి ఇది 18,138 మెగావాట్లకు, 2034–35 నాటికి 31,808 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇదే సమయంలో విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
మూడు సంవత్సరాల విద్యుత్తు ప్రణాళిక
రాబోయే మూడు సంవత్సరాల్లో విద్యుత్తు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మెట్రో విస్తరణ, రైల్వే ప్రాజెక్టులు, ఇతర మాస్ ట్రాన్స్‌పోర్ట్ అవసరాల కోసం విద్యుత్తు డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర కార్పొరేషన్ల అవసరాలకూ సరిపడే విధంగా విద్యుత్తు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
క్లీన్ ఎనర్జీ, ప్లోటింగ్ సోలార్‌పై దృష్టి
క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని, ఇటీవల ప్రవేశపెట్టిన ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ’పై అధికారులు పూర్తి ఫోకస్ పెట్టాలని సూచించారు. విద్యుత్తు రంగంలో ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ దిగ్గజ సంస్థలను పెట్టుబడులకు ఆకర్షించాలని చెప్పారు.
డేటా సిటీ – హైదరాబాద్ భవిష్యత్ దిశ
హైదరాబాద్ దేశంలోని గ్లోబల్ కెపాబులిటీ సెంటర్ల హబ్‌గా మారిందని, త్వరలో డేటా సెంటర్ల హబ్‌గా అభివృద్ధి చెందబోతుందని సీఎం తెలిపారు. డేటా సిటీగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. దీంతో వచ్చే విద్యుత్తు అవసరాలను ముందుగానే గుర్తించి, ప్లానింగ్ చేసుకోవాలన్నారు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు విద్యుత్తు ప్రణాళిక
అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్‌షిప్‌లకు కావాల్సిన విద్యుత్తు అవసరాలపై హెచ్ఎండీఏతో విద్యుత్తు శాఖ సమన్వయం చేయాలని సూచించారు. అలాగే భవిష్యత్తులో విద్యుత్తు డిమాండ్‌కు తగిన విధంగా సబ్‌స్టేషన్ల అప్‌గ్రేడ్, విద్యుత్తు లైన్ల ఆధునీకరణ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.
ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక విద్యుత్తు ప్రణాళిక
ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో విద్యుత్తు టవర్లు, పోల్స్, లైన్లు బహిరంగంగా కనిపించకూడదని, హైటెన్షన్ లైన్లను కూడా ఆ ప్రాంతం నుంచి తరలించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. ఆ ప్రాంతానికి పూర్తిగా భూగర్భ విద్యుత్తు లైన్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
స్మార్ట్ పోల్స్ పై ప్రయోగాత్మక చర్యలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని, తొలిదశలో సచివాలయం, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో అమలు ప్రారంభించాలని చెప్పారు.
సోలార్ విద్యుత్తు వినియోగానికి ప్రణాళిక
అవుటర్ రింగ్ రోడ్ పొడవునా సోలార్ విద్యుత్తును వినియోగించుకునే ప్రణాళికపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే పాదచారుల మార్గాలు, నాలాలపై సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
సమీక్షా సమావేశానికి హాజరైన అధికారులు
జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, టీజీ రెడ్కో ఎండీ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి