లాకప్ డెత్‌కు గురైన మరియమ్మకు న్యాయం జరిగేలా చూస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆమె మరణానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఖమ్మంలో పర్యటించిన ఆయన.. మరియమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో లాకప్ డెత్ లో చనిపోయిన మరియమ్మ సంఘటన దురదృష్టకరమన్నారు డీజీపీ. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని, బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల ఆత్మహత్యకు యత్నించి.. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడిని డీజీపీ కలిశారు. అతని ఆరోగ్యంపై వైద్యులను ఆరా తీశారు. మరియమ్మ కుటుంబ సభ్యులతో ఆమె మృతి గురించి మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికే బాధిత కుటుంబాని తగిన సాయాన్ని ప్రకటించిందన్నారు డీజీపీ. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ప్రజలకు దగ్గరవుతున్న సమయంలో మరియమ్మ ఘటన జరగడం దురదుష్టకరమని చెప్పారు.
“మరియమ్మ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ప్రజల ఆత్మగౌరవం, ప్రాణాలకు భంగం కలగకుండా నడుచుకుంటాం. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగక్కుండా చూస్తాం. నేరాలను నిరోదించే క్రమంలో ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తీయకుండా పోలీసులు విచారణ జరపాలి” అని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈనెల 18న అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో మరియమ్మ మృతిచెందడం రాష్ట్రవ్యాప్తంగా సంచలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నలుగు పోలీసు అధికారులపై వేటు పడింది. మరియమ్మ లాకప్‌డెత్‌పై విపక్షాలు, ప్రజాసంఘాల ఆందోళనతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్ బృందం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన కేసీఆర్… దళితులపై చేయిపడితే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించిన సీఎం… లాకప్‌డెత్ పూర్వాపరాలు తెలుసుకోవాలని డీజీపీని ఆదేశించారు. దీంతో ఆయన నేడు ఖమ్మంలో పర్యటించారు.