Lockup Death: మెదక్‌ లాకప్‌ డెత్‌పై డీజీపీ అంజనీకుమార్‌ సీరియస్‌.. విచారణకు ఆదేశం.. అసలు ఏం జరిగింది?

|

Feb 18, 2023 | 5:24 PM

మెదక్‌లో జరిగిన ఖదీర్‌ఖాన్‌ అనే వ్యక్తి మృతిపై డీజీపీ అంజనీకుమార్‌ సీరియస్‌ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ విచారణను ఐజీ చంద్రశేఖర్‌ పర్యవేక్షించనున్నారు...

Lockup Death: మెదక్‌ లాకప్‌ డెత్‌పై డీజీపీ అంజనీకుమార్‌ సీరియస్‌.. విచారణకు ఆదేశం.. అసలు ఏం జరిగింది?
Lockup Death
Follow us on

పోలీసులు విచారణ పేరుతో నిందితులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో చోరీ చేశాడన్న నెపంతో ఖదీర్‌ ఖాన్ అనే యువకుడి పట్ల కర్కశత్వంగా వ్యవహరించారు పోలీసులు. లాఠీ దెబ్బలు తాళలేక చివరికి ప్రాణాలే కోల్పోయాడా యువకుడు.

మెదక్​పట్టణానికి చెందిన ఖదీర్‌ను.. దొంగ అనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తమ దాష్టీకాన్ని ప్రదర్శించారు. పీఎస్‌లో నాలుగు రోజుల పాటు విపరీతంగా కొట్టి.. నిందితుడు అతను కాదని తెలిసి వదిలేశారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న భర్తను ఆసుపత్రికి తీసుకెెళ్లేందుకు భార్య ప్రయత్నించగా.. ఎక్కడా తమ తప్పు బయటపడకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉంచి.. చికిత్స పేరు పోలీసులు పెద్ద డ్రామానే నడిపారని ఖదీర్ భార్య ఆరోపిస్తోంది.

ఫిబ్రవరి 2 వరకు మెదక్‌ పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచన పోలీసులు తమ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. నాలుగు రోజులపాటు చిత్రహింసలకు గురి చేశారు. అనంతరం అతడు నిందితుడు కాదని తెలుసుకొని.. భార్యకు విషయం చెప్పారు. అతడిని ఇంటికి తీసుకెళ్లాలని అన్నారు. ఆందోళనతో స్టేషన్‌కు వెళ్లిన భార్య సిద్ధేశ్వరి నడవలేని స్థితిలో ఉన్న భర్తను చూసి షాక్‌కు గురైంది. అతి కష్టం మీద భర్తను ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులు ఖదీర్ ఖాన్ ఇంటికి వచ్చే తామే కొన్ని మందులు తెచ్చిస్తామని ఆయన్ను బయటకు తీసుకురావొద్దని పోలీసులు హెచ్చరించారని ఖదీర్ భార్య ఆరోపించింది.

ఖదీర్ ఖాన్ పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో ఆయన్ను మెదక్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి మెరుగు పడకపోవటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 12న ఖాదీర్‌ను సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ.. ఫిబ్రవరి 16న రాత్రి 11 గంటలకు ప్రాణాలు విడిచాడు ఖదీర్ ఖాన్.

ఆసుపత్రిలో ఖదీర్ ఖాన్‌ను పరామర్శించేందుకు పలువురు స్థానిక నేతలు వెళ్లారు. ఈ సందర్భంగా తనను పోలీసులు ఎలా కొట్టారో ఆయన వివరించారు. హైదరాబాద్ నుంచి మెదక్ పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి తనను రెండు గంటలపాటు తలక్రిందులుగా వేలాడదీశారని ఖదీర్ వారికి వివరించాడు. కర్రలు, బెల్టుతో ఇష్టం వచ్చినట్లు తెలిపాడు. ఆ దెబ్బలను తాను భరించలేకపోయానన్నారు. దొంగతతనం చేయలేదని ఎంత మెుత్తుకున్నా వాళ్లు వినలేదని బోరుమన్నాడు ఖదీర్. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషలో మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే పోలీసులు వెర్షన్ మాత్రం భిన్నంగా ఉంది. దొంగతనం చేశాడనే అనుమానంతో ఖదీర్‌ ఖాన్‌ను మెదక్‌ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమేనని డీఎస్పీ సైదులు అన్నారు. సాంకేతికపరమైన విచారణ మాత్రమే చేశారని, అతడిని కొట్టలేదన్నారు. ఇంటికి పంపించిన తర్వాత కొద్దిరోజులకు అతను అస్వస్థతకు గురయ్యాడని, ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదన్నారు. అయితే తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కలిసి వేడుకున్నారు. దీంతో రాష్ట్ర పోలీస్ డీజీపీ అంజన్ కుమార్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు వరంగల్‌ రేంజ్‌ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి