
దట్టమైన పొగమంచు ఓరుగల్లును కమ్మేసింది.. ఎటు చూసినా మంచు దుప్పటి కప్పేయడంతో ఊటీలో ఉన్నామా..! ఓరుగల్లులో ఉన్నామా..! అనే సందేహం కలిగేలా మంచు పొరలు జనాన్ని ఆహ్లాద పరుస్తున్నాయి. వాహనదారులకు మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. జాతీయ రహదారులు మొత్తం మంచు దుప్పటి కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారక సైతం హెడ్ లైట్స్ వేసుకొని వెళ్తున్నారు.
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుండే పొగ మంచు కమ్మేసింది. జాతీయ రహదారులతో సహా ప్రధాన రహదారులు మొత్తం పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వాహనదారులు వారి వాహనాలు రోడ్డు పక్కన నిలుపుకుని పార్కింగ్ లైట్స్ వేసుకుని వేచి చూస్తుంటే, మరికొంతమంది హెడ్ లైట్స్ వేసుకుని ముందుకు సాగుతున్నారు.
హైదరాబాద్ – వరంగల్, వరంగల్ నుంచి భూపాలపల్లి, వరంగల్ – ఏటూరునాగారం, వరంగల్ – ఖమ్మం, వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారి పూర్తిగా పొగ మంచు కమేసింది. కనీసం 10 మీటర్ల దూరంలో ఉన్న వాహనం కూడా కనిపించ లేకుండా మంచు దుప్పటి కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు పొగ మంచును ఎంజాయ్ చేస్తూ.. ఓరుగల్లు ప్రజలు ఆనందంతో మురిసిపోతున్నారు. ఎప్పుడూ కనివిని ఎరుగని విధంగా పొగ మంచు ఓరుగల్లు ను కమ్మేసింది. కనుచూపు మేరకు ఎటు చూసినా మబ్బులు కమ్ముకున్నట్లుగా పొగ మంచు అలముకుంది. ముఖ్యంగా ఓరుగల్లు అందాల ఖిల్లా వరంగల్ కోట ప్రాంగణమంతా పొగమంచు కమ్మేయడంతో మంచులో కాకతీయుల కాలంనాటి నిర్మాణాలు మనసు దోచేస్తున్నాయి. ఖిల్లా వరంగల్ లో ఫోటోలు దిగడం కోసం జనం పరుగులు తీస్తున్నారు. ఖిల్లా వరంగల్ అందాలను మంచుపురలో మస్త్ ఎంజాయ్ చేశారు. రామప్ప, వేయి స్తంభాల గుడి ఆలయాలు కూడా పూర్తిగా పొగమంచు కమ్మేశాయి. మంచుపొరల్లో వాటిని ఫోటోలో క్లిక్ మనిపించి మురిసిపోతున్నారు.
అయితే మంచులో ప్రయాణాల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో మంచు విపరీతంగా కురుస్తున్న వేళ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మంచు విపరీతంగా కురుస్తున్న సమయంలో అతివేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని సాధ్యమైనంత వరకు మంచు కురిసే సమయంలో ప్రయాణం చేయకూడదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం – వరంగల్ మధ్య జాతీయ రహదారి పూర్తిగా మంచుతో కమ్మేయడంతో ఆ మార్గంలో ప్రమాదాలు జరుగకుండా జిల్లా ఎస్పీ శబరీష్ పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..