ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో తన పేరు ఉండటంపై టీఆర్ఎస్ ఎంఎల్‌సీ కె.కవిత స్పందించారు. కేంద్రంలోని బీజేపీ తీరుపై మండిపడ్డారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చారని విమర్శించారు. వచ్చే డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలున్నాయని.. అందుకే మోదీ వచ్చే ముందు ఈడీ ఇక్కడికి వచ్చిందన్నారు. ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం.. బీజేపీ నీచమైన రాజకీయ ఎత్తుగడ అని అన్నారు కవిత. తాను ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాని స్పష్టం చేశారు. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం ఇస్తానని అన్నారు.
అటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా కేంద్రం తీరుపై మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర సర్కార్ కుట్ర చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ మాగుంట. మిత్ అరోరా ఎవరో తనకు తెలియదన్నారాయన. లిక్కర్ స్కామ్‌లో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. 70 ఏళ్ల నుంచి తాము వ్యాపారంలో ఉన్నామని, ఇప్పుడొచ్చినవి కేవలం ఆరోపణలు మాత్రమేనన్నారు.
ఢిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్న 36 మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అమిత్ అరోడా రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆయనను ఈడీ మంగళవారం రాత్రి అరెస్టు చేసింది. బుధవారం ఇక్కడి కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్ రిపోర్టు సమర్పించింది. వీరిలో తెలుగురాష్ట్రాలకు చెందిన కల్వకుంట్ల కవిత, శరత్‌రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్, సృజన్‌రెడ్డిలు ఉన్నారు. తనపై ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు రేపుతోంది. నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. లిక్కర్ పాలసీలో పెంచిన 12 శాతం కమీషన్‌ను ఆప్ ప్రభుత్వానికి అప్పగించేలా లావాదేవీలు జరిపినట్టు రిమాండ్ రిపోర్టులో ఈడీ ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ పేరుతో సిండికేట్‌గా మారి 100 కోట్ల ముడుపులు ముట్టచెప్పారని ఈడీ ఆరోపించింది. పలు ఫోన్లను మార్చి కవిత లావాదేవీలు జరిపినట్లు రిపోర్ట్‌లో పొందుపర్చింది. అంతేకాదు ఆయా వ్యక్తుల ఫోన్లకు సంబంధించిన ఐఎంఈఐ నెంబర్లను రిపోర్టులో పేర్కొంది. బీజేపీ నేతలు తన పేరు ప్రస్తావించడంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు కవిత.
మరిన్ని తెలగాణ వార్తల కోసం