
ఏడాదిగా స్తబ్దుగా ఉన్న లిక్కర్ కేసు మరోసారి సంచలనాలు రేపుతోంది. కవిత ఢిల్లీ పీఏ అప్రూవర్‌గా మారడంతో.. ఆమెను నిందితురాలిగా చేరుస్తూ నోటీసులిచ్చింది సీబీఐ. ఢిల్లీలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే తాను ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కాలేనని కవిత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు లేఖ రాశారు. కాగా, విచారణకు సమన్లను దాటవేయడం ఇది రెండోసారి. డిసెంబర్ 2022లో సెంట్రల్ ఏజెన్సీ ఆమెను చివరిగా ప్రశ్నించింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఏడాది గ్యాప్ తర్వాత ఎమ్మెల్సీ కవితకు ఇటీవల సీబీఐ నోటీసులు ఇవ్వడమే కాదు, ఆమెను నిందితురాలిగా చేర్చింది. గతంలో ఇంటికొచ్చి స్టేట్‌మెంట్ తీసుకున్న సీబీఐ.. ఫిబ్రవరి 26న ఢిల్లీకి రావాలని, తమ ఎదుట విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో కవితను నిందితురాలిగా చేర్చి 41-A కింద సీబీఐ నోటీసులు ఇచ్చింది.
గతంలో సమాచారం కోసం కవితను హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చి 160 సీఆర్‌పీసీ కింద ప్రశ్నించింది సీబీఐ. 2022 డిసెంబర్‌లో కవితను ప్రశ్నించింది సీబీఐ. ఇదే కేసులో ఇప్పటికే మూడుసార్లు కవితను ఈడీ కూడా విచారించింది. లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూవర్లుగా మారడంతో వారి స్టేట్మెంట్స్ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేసింది సీబీఐ. లిక్కర్ కేసులో నిందితులు మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డితో పాటు కవిత ఢిల్లీ పీఏ అశోక్ కౌశిక్ అప్రూవర్‌గా మారడంతో.. కేసు కీలక మలుపు తిరిగింది. పీఏ అశోక్ జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పాడు. లిక్కర్ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందించినట్టు అంగీకరించాడు. దీంతో.. అశోక్‌ను, కవితను నిందితులుగా చేర్చి, విచారించేందుకు సిద్ధమైంది సీబీఐ. మరోవైపు లిక్కర్ కేసులో ఈడీ నోటీసుల్ని ఇప్పటికే.. సుప్రీంలో సవాల్ చేశారు కవిత. ఆ పిటిషన్‌కి సంబంధించి ఫిబ్రవరి 28న విచారణ ఉంది.
ఇదిలావుంటే నోటీసుల పేరుతో ఆమెను రప్పించి అరెస్టుకు రంగం సిద్ధం చేసిందన్న టాక్ వినిపిస్తోంది. పరిస్థితి గమనించిన కవిత.. సోమవారం హాజరుకావాల్సి ఉండగా, ఆదివారం సాయంత్రం సీబీఐకి లేఖ రాసింది. తాను వ్యక్తిగత కారణాల దృష్ట్యా సీబీఐ విచారణకు హాజరుకాలేకపోతున్నాను అంటూ లేఖ రాశారు. పార్లమెంటు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నాయని, ముందుకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వివిధ ప్రజా కార్యక్రమాలకు హాజరు కావల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. అలాగే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు ప్రస్తావన కూడా తీసుకువచ్చారు కవిత. కావాలంటే వర్చువల్ ఎంక్వైరీకి హాజరవుతానని తేల్చి చెప్పారు. లీగల్ ఓపినియన్ మేరకే ఎమ్మెల్సీ కవిత ఈ లేఖాస్త్రాన్ని సంధించినట్లు తెలుస్తోంది. కాగా సీబీఐ దీనిపై ఏవిధంగా స్పందిస్తుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…