Watch: అందుకే ఢిల్లీలోనూ ఏపీ మాదిరి ఫలితాలు.. ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు

Delhi Election 2025 Results: ఢిల్లీలో కమలం వికసించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఈ గ్రాండ్ విక్టరీ వెనక మాస్టర్‌ మైండ్ స్ట్రాటజీ అమలు చేసింది బీజేపీ అధిష్ఠానం. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతలు అప్పగించింది. ఆప్‌ కంచుకోటలను బద్ధలు కొట్టింది.

Updated on: Feb 08, 2025 | 6:44 PM

ఢిల్లీలో కమలం వికసించింది. 27 ఏళ్ల తర్వాత అక్కడ అధికార పగ్గాలు సొంతం చేసుకుంది. మొత్తం 70 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ విజయంతో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వ్యూహ రచనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (BJP MP Dharmapuri Aravind) కూడా కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలో పార్టీ ఘన విజయం వెనుక పనిచేసిన కీలక వ్యూహరచన బృందంలో తాను భాగస్వామ్యం కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు.

ఉచిత పథకాలు మాత్రమే గెలిపిస్తాయనుకోవడం పొరపాటుని.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమితో ఇదే నిరూపణ అయ్యిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించిన తర్వాత ఉచితాలు ప్రయోజనకరం అన్నారు. ఈ సందర్భంగా ధర్మపురి అరవింద్ టీవీ9తో మాట్లాడుతూ మౌలిక వసతులు లేనప్పుడు ఎన్ని ఉచితాలిచ్చినా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ మాదిరి ఫలితాలే వస్తాయన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ పనితీరును చూసే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిపించారని ధర్మపురి వ్యాఖ్యానించారు. దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఢిల్లీ అసెంబ్లీ గెలవకపోవడం పార్టీకి ఒక లోటుగా ఉండేది.. ఇప్పుడది తీరిపోయిందన్నారు. ఎన్నికల వ్యూహా బృందంలో తనను చేర్చి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన జంగ్‌పురా, ఆర్కేపురం నియోజకవర్గాల్లో బీజేపీ గెలవడం ఆనందకరమన్నారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఓడించడం సాధారణ విషయం కాదన్నారు. ఆ నియోజకవర్గంలో మొత్తం మైనారిటీలు 18% ఉన్నారని గుర్తుచేశారు. వ్యూహాత్మకంగా పనిచేసి గెలుపు కోసం కృషి చేశామన్నారు. ఢిల్లీ సీఎం ఎవరన్నది బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని చెప్పారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించి 27 ఏళ్ల విరామం తర్వాత అక్కడ అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది. అధికార ఆప్ కేవలం 22 స్థానాలకు పరిమితమయ్యింది.