Hyderabad: రోడ్లపై కంటికి కనిపించని మృత్యువు..! అలర్ట్‌గా లేకపోతే అంతే సంగతులు!

సంక్రాంతి వచ్చిందంటే చాలా జనాల ప్రాణాలు తీసేందుకు కాచుకు కూర్చుంటుంది చైనా మాంజా. ఇక ఈసారైతే సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే రాష్ట్రంలో వీటి దాడులు మొదలయ్యాయి. ఆకాశంలో ఎగిరే గాలిపటం ఆనంద హేతువైతే, అదే రోడ్డుపై పడే మాంజా దారం మానవుల మృత్యవకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ కంటికి కనిపించని మృత్యువు పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Hyderabad: రోడ్లపై కంటికి కనిపించని మృత్యువు..! అలర్ట్‌గా లేకపోతే అంతే సంగతులు!
Chinese Manja Dangers

Edited By:

Updated on: Jan 02, 2026 | 8:39 PM

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ – చందానగర్ ప్రధాన రహదారి, మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనదారుల మెడలకు చైనీస్ మాంజా చిక్కి తీవ్ర గాయాలపాలైన ఘటనలు కలకలం రేపాయి. బాలానగర్ రహదారిపై ట్రాఫిక్ మధ్యలో ద్విచక్ర వాహనదారుడి మెడకు దారం తగలడం వలన మెడకు తీవ్ర గాయమయ్యింది. అపార్ట్ మెంట్లు, మేడలపై నుంచి గాలిపటాలు ఎగురవేయడం కారణంగా మాంజా చెట్ల కొమ్మలకు, విద్యుత్ తీగలకు చిక్కి రోడ్డుపై వేలాడటం కారణంగా ప్రమాదాలకు దారి తీస్తోంది.

చైనీస్ మాంజా నైలాన్, సింథటిక్ ఫైబర్‌తో తయారవడంతో పాటు గాజుపొడి, లోహచూర్ణం పూత ఉండటంతో అత్యంత పదునుగా, ప్రమాదకరంగా మారుతోంది. ఈ మాంజా ఒక్కసారిగా వేగంగా మెడకు చుట్టుకుంటే తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉంది.

మూగజీవాలకూ ముప్పే..

ఇవి కూడా చదవండి

మానవులకే కాదు, పక్షులు, ఇతర మూగజీవలకూ ఈ మాంజా వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. పిచ్చుకలు, కాకులు, గద్దలు, రెక్కలకు దారాలు చిక్కి ఎగరలేక మృతి చెందుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. వీధి కుక్కలు, పశువుల కాళ్లకు దారాలు చుట్టుకుని గాయాలవుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా మాంజా అమ్మినా, వినియోగించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సైరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

సైబరాబాద్ పోలీసుల సూచనలు

  • చైనీస్ మాంజా, నైలాన్, గాజు లేదా మెటల్ కోటింగ్ ఉన్న చైనీస్ మాంజాను అమ్మవద్దు, కొనవద్దు.
  • కాటన్ దారాలనే ఉపయోగించాలి.
  • చైనీస్ మాంజా విక్రయం, నిల్వ, రవాణా చట్టవిరుద్ధమని గుర్తుంచుకోవాలి.
  • ఇంటి పైకప్పులు, టెర్రస్‌ ల పై గాలిపటాలు ఎగరవేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తప్పనిసరి. గోడ అంచులు లేని మిద్దె పై నుంచి కింద పడే ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
  • పిల్లలు గాలిపటాలు ఎగరవేసే సమయంలో ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రులు లేదా పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలి.
  • రోడ్లు, ప్రధాన రహదారులు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరవేయకూడదు.
  • విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, సెల్ టవర్ల సమీపంలో గాలిపటాలు ఎగరవేయడం ప్రమాదకరం.
  • విస్తృతమైన బహిరంగ ప్రదేశాలు, మైదానాలను మాత్రమే గాలిపటాలు ఎగురవేయడానికి అనువైనవి.
  • ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. తద్వారా ప్రమాదలను కొంతవరకు నివారించవచ్చు.
  • రోడ్డుపై వేలాడుతున్న గాలిపటాల దారాలు కనిపిస్తే వెంటనే జీహెచ్ఎమ్ సీ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
  • తెగిపోయిన గాలిపటాల దారాలను రోడ్లు, చెట్లపై కనిపిస్తే సురక్షితంగా సేకరించి జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలి.
  • చెట్లపై లేదా విద్యుత్ తీగలపై చిక్కుకున్న దారాలను స్వయంగా తొలగించే ప్రయత్నం చేయకూడదు.
  • వాహనదారులు గాలిపటాల సీజన్‌లో మితవేగంతో ప్రయాణించాలి.
  • చిన్న పిల్లలను రోడ్లపై లేదా జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరవేయడానికి అనుమతించకూడదు.
  • చైనీస్ మాంజా విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
  • చట్టవిరుద్ధంగా చైనీస్ మాంజా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గుర్తుంచుకోవాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.