Telangana: పోలీస్‌ వెబ్‌సైట్ల హ్యాక్‌.. ఎలా జరిగింది..?

పోలీసులకే షాకిస్తూ సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ వెబ్‌సైట్లను కేటుగాళ్లు హ్యాక్‌ చేశారు. అయితే పదిరోజులపాటు శ్రమించి ఆ సైట్స్‌ను పునరుద్దరించారు. మరీ పదిరోజులపాటు పోలీసులు ఏం చేశారు...? అసలీ హ్యాకింగ్‌ ఎలా జరిగింది..? దేనికోసం జరిగింది...? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ...

Telangana: పోలీస్‌ వెబ్‌సైట్ల హ్యాక్‌.. ఎలా జరిగింది..?
Police Website

Updated on: Dec 04, 2025 | 10:03 PM

సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులకే సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. ఏకంగా పోలీస్ శాఖకు చెందిన రెండు వెబ్‌సైట్లను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్‌సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. సైట్‌ను ఓపెన్‌ చేస్తే బెట్టింగ్ సైట్స్‌కు రీడైరెక్ట్‌ అవుతోంది. దీంతో పదిరోజులపాటు రెండు కమిషనరేట్ల పోలీస్ వెబ్ సైట్లు పని చేయలేదు. ఈ రెండు వెబ్‌సైట్‌లతో పాటు మరికొన్ని ప్రభుత్వ కీలక వెబ్‌సైట్‌లు నిర్వహిస్తున్న నేషనల్​ ఇన్​ఫర్మేటిక్ సెంటర్ NICతో కలిసి హ్యాకింగ్ ముఠాలపై దృష్టి పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు… ఎట్టకేలకు సైట్లను రీస్టార్ట్‌ చేశారు.

హ్యాక్‌కు గురైన వెంటనే ఐటీ విభాగం సర్వర్లను డౌన్ చేసింది. NICతో కలిసి దర్యాప్తు చేపట్టి పునరుద్దరించింది. మరోవైపు టెక్నికల్ ఇష్యూస్‌ కారణంగానే వెబ్‌సైట్స్‌ను కొన్నిరోజులు క్లోజ్‌ చేసినట్లు సైబరాబాద్‌ డీసీసీ చెబుతున్నారు. ఇక నవంబర్ ‌15న హైకోర్టు వెబ్‌సైట్‌ కూడా హ్యాకయ్యింది. పోలీస్‌ వెబ్‌సైట్లకు జరిగినట్టే.. హైకోర్టు సైట్‌ ఓపెన్ చేస్తే అది బెట్టింగ్‌ వెబ్‌సైట్లకు రూట్ అయ్యింది. వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్‌ DGPకి ఫిర్యాదు చేశారు. దీనికంటే 15 రోజుల ముందు మరికొన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లకీ ఇదే పరిస్థితి వచ్చింది. GHMC సహా కొన్ని ప్రభుత్వ వెబ్‌సైట్ల డేటాను సైబర్‌ నేరగాళ్లు చోరీ చేసినట్టు వార్తలొచ్చాయి. దీంతో ఈ తరహా సైబర్‌ క్రైమ్స్‌పై పోలీస్‌ శాఖ సీరియస్‌గానే దృష్టి పెట్టింది. ఇంతలోనే ఏకంగా సైబరాబాద్‌, రాచకొండ పోలీసుల వెబ్‌సైట్లు హ్యాక్ అవడం చర్చనీయాంశంగా మారింది.