సైబర్ నేరగాళ్లు తెలివి మీరిపోయారు. రోజుకో కొత్త ప్లాన్‌తో సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలకు చిక్కింది. ఇన్‌స్టాలో పోస్టులకు రేటింగ్స్, రివ్యూస్ ఇవ్వాలంటూ ఏకంగా రూ. కోటిన్నరకు ఎగనామం పెట్టారు. దీంతో ఇక చేసేదేమిలేక చివరికి పోలీసులను ఆశ్రయించింది బాధిత మహిళ.
ఇన్‌స్టాగ్రామ్‌లో తాము సూచించిన పేజీలకు రేటింగ్స్, రివ్యూస్ ఇస్తే.. కమిషన్ రూపంలో డబ్బులు ఇస్తామంటూ నమ్మించి.. బోల్తా కొట్టించారు. పీరం చెరువు ప్రాంతంలో నివాసముండే ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి టెలిగ్రామ్ ద్వారా ఓ మెసేజ్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగా.. ఇన్‌స్టాలో పోస్టులకు కామెంట్స్ చేస్తే.. రోజూ డబ్బులు సంపాదించవచ్చునని.. అందుకుకోసం ముందుగా కొంత నగదు చెల్లించాలని నమ్మబలికించారు. అలా ఆమె దగ్గర నుంచి ఏకంగా కోటిన్నర రూపాయలు కొల్లగొట్టారు సైబర్ కేటుగాళ్లు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.