
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతోంది. ఈ మేరకు సమీక్ష చేసిన సీఎస్.. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూలో.. డీజీపీ రవిగుప్తాతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఎస్ శాంతికుమారి. ఈ వేడుకలు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ముందుగా.. సీఎం రేవంత్‌రెడ్డి గన్‌పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి.. ఆ తర్వాత.. పరేడ్ గ్రౌండ్‌లోని వేడుకల్లో పాల్గొంటారన్నారు. దానిలో భాగంగా.. పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రముఖులు ప్రయాణించే మార్గాల్లో అవసరమైన బందోబస్తుతోపాటు.. పార్కింగ్ స్థలాలను కేటాయించి.. ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలన్నారు సీఎం శాంతికుమారి. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. అలాగే.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా షామియానాలతోపాటు బారికేడింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులకు సూచించారు. సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులతోపాటు తాగునీటి సౌకర్యాలు కల్పించాలని, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలతో అలంకరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు తెలిపారు సీఎస్ శాంతికుమారి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలకు ప్లాన్ చేయాలని సాంస్కృతిక శాఖకు స్పష్టం చేశారు. అటు.. నిరంతరాయంగా త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖకు సూచించారు. మొత్తంగా.. అన్ని శాఖల సమన్వయంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు సీఎస్ శాంతికుమారి.