Cotton prices: ఊరించి.. ఊసూరుమనిపించి.. పత్తి ధర తగ్గడంపై అనుమానాలు

|

Nov 28, 2022 | 7:30 AM

పత్తి రైతులకు మళ్లీ కన్నీళ్లే మిగులుతున్నాయ్‌. తెల్ల బంగారం ధరలు ఒక్కసారిగా పతనమవడంతో తల్లడిల్లిపోతున్నారు రైతన్నలు

Cotton prices: ఊరించి.. ఊసూరుమనిపించి.. పత్తి ధర తగ్గడంపై అనుమానాలు
Cotton Price
Follow us on

తెల్ల బంగారం కన్నీళ్లు పెట్టిస్తోంది. మొన్నటివరకు మాంచి ధర పలికిన పత్తి, ఇప్పుడు ఒక్కసారిగా పతనమైంది. వారం రోజుల్లో వెయ్యి రూపాయల కంటే ఎక్కువగా ధర పడిపోయింది. ఇది మరింత పతనమయ్యే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. క్వాలిటీని బట్టి 9600 నుంచి పదివేల రూపాయల వరకు పలికింది క్వింటా పత్తి. దాంతో, రైతుల్లో సంతోషం వ్యక్తమైంది. ఆశించినంత కాకపోయినా, కనీస మద్దతు ధర లభిస్తోందని ఆనందపడ్డారు.

కానీ, రైతుల సంతోషం ఎన్నో రోజులు నిలువలేదు. వాళ్ల ఆనందం మూడ్నాళ్ల ముచ్చటే అయ్యింది. వారం రోజుల్లో క్వింటా పత్తి ఏడువేల నుంచి ఎనిమిది వేల రూపాయల్లోపుకి పడిపోయింది. వారం రోజులుగా పత్తి ధర పతనమవుతూ వస్తోంది. రోజురోజుకీ ధర పడిపోతోంది. దాంతో, పత్తి రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. క్వింటాకు కనీసం 12వేల రూపాయలు చెల్లిస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని, లేదంటే ఎకరాకు లక్ష వరకు నష్టం తప్పదంటున్నారు రైతులు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వ్యాపారులు కుమ్మక్కై ధరను తగ్గించినట్లు రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల పంట తీవ్రంగా నష్టపోయామని, ధరలు కూడా పతనమైతే.. తమ జీవితాలు నాశనం అవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూది, పత్తిగింజలు, పత్తి నూనె ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో నిలకడగా ఉన్నప్పటికీ.. స్థానికంగా పత్తి రేటు తగ్గడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..