
కాంగ్రెస్ లో వరుసగా చేరికలు జరుగుతున్నాయి ఈ చేరికలు పార్టీకి కలిసి వస్తాయా? బలహీనంగా ఉన్న ప్రాంతాలపై హస్తం నేతలు దృష్టి పెట్టారా? కాంగ్రెస్ ఎక్కడెక్కడ వీక్ గా ఉంది. ఎక్కడెక్కడ బలంగా ఉంది. కర్నాటక ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరింగింది. చేరికలతో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తోన్న కాంగ్రెస్ అధిష్టానం ఇతర పార్టీల కీలక నేతలను హస్తం గూటికి చేర్చే పనిలో పడ్డారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనతోపాటు జూపల్లి శ్రీనివాసరావు తన అనుచరులతో సహా మహబూబ్ నగర్ సభ నుంచి పార్టీలో చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పక్క పార్టీల ఇతర పెద్ద నేతలకు గాలం వేసే పనిలో కాంగ్రెస్ ఫుల్ బిజీగా ఉంది. ఎప్పటికప్పుడు సర్వేలు చేపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ దృష్టి పెట్టాలో ఒక అంచనాకు వచ్చినట్లు కనిపిస్తోంది.
కాంగ్రెస్ బలంగా ఉన్న ఉమ్మడి జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని, పార్టీ బలంగా లేని జిల్లాల్లో చేరికపై మరింత దృష్టి పెట్టి ఎవరెవరిని పార్టీలోకి లాగాలో లిస్ట్ సిద్దం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీకి ఆదేశించినట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బలంగా ఉంది.
ఇటీవల మహబూబ్ నగర్లో భట్టి పాదయాత్ర సందర్భంగా జరిగిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతూ నా సొంత జిల్లా నుండి అత్యధిక సీట్లు కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఆ బాధ్యత పాలమూరు జిల్లా ప్రజలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ హేమాహేమీలు ఉన్నందున ఆ పార్టీకి అక్కడ తిరుగులేదని అక్కడి క్యాడర్ చెబుతున్నారు. ఖమ్మంలో పొంగులేటి అండ్ కో చేరిన తర్వాత పార్టీ మరింత బలోపేతం అయింది అని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు గ్రేటర్‌లో హవా చూపించిన కాంగ్రెస్ ఇప్పుడు ఢీలా పడిపోయింది. గ్రేటర్‌లో మళ్ళీ చక్రం తిప్పాలని కాంగ్రెస్ చూస్తోంది. గతంలో పార్టీలో ఉండి ప్రస్తుతం వేరే పార్టీల్లో పని చేస్తున్న నాయకులను, పక్క పార్టీల్లో ఉన్న బలమైన నాయకులను తిరిగి కాంగ్రెస్‌లోకి తేవడం ద్వారా గ్రేటర్‌లో పుంజుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
మెదక్ జిల్లాలో కూడా తన ముద్ర వేసిన కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ దాదాపు ప్రాబల్యం కోల్పోయిందని తెలుస్తోంది. జగ్గారెడ్డి కూడా కార్యక్రమాలకు దూరం ఉండడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలే లేకుండ పోయాయి. ఒకప్పుడు ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో ప్రియాంక గాంధీని పోటీ చేయించి అక్కడ జోష్ తేవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది.
ఇక నిజామాబాద్ లో కూడా కాంగ్రెస్ కాస్త వెనకంజలో ఉందని అక్కడి నేతలే భావిస్తున్నారు. అక్కడ బలంగా ఉన్న అధికార పార్టీ నుండి కొందర్ని పార్టీలోకి లాగడం వల్ల కాంగ్రెస్ బలపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. పాత కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ చర్చలు జరుపుతోందని సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యే స్థాయి నేతలను పార్టీలోకి లాగితే అధికార పార్టీని దెబ్బ కొట్టోచ్చని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది.
రాహుల్ గాంధీ కూడా తెలంగాణపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని అక్కడ తప్పకుండా గెలుస్తామని పదే పదే చెప్తున్నారు. పార్టీలో చేరికకపై దృష్టి పెట్టాలని గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన నాయకులను మళ్ళీ కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేలా కృషి చేయాలని రాహుల్ రాష్ట్ర నేతలకి సూచించారు. చేరికలపై రాహుల్ గాంధీ తన సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలంతా తిరిగి వెనక్కి రావడం ఆనందంగా ఉందని, ఘర్ వాపసీ సక్సెస్ అవుతుందని రాహుల్ చెప్తున్నారు. కేసీఆర్ హటావో తెలంగాణ బచావో నినాదంతో ముందుకు సాగాలని రాహుల్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.
కర్నాటక ఎన్నికల ముందు అక్కడి కాంగ్రెస్ లో కూడా చేరికలు భారీగా జరిగాయి. వాటితో అక్కడ పార్టీ మరింత బలంగా మారింది. తెలంగాణలో కూడా అదే స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. చేరికల అంశంపై ఎవరితో మాట్లడడానికైనా, ఎంత సమయం ఇవ్వడానిమైనా సిద్దంగా ఉన్నట్లు ప్రియాంక, రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీలో పొంగులేటి, జూపల్లి లాంటి నాయకుల చేరికలు క్లారిటీతో కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రియాంక మహబూబ్ నగర్ సభ తర్వాత పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ వీక్ గా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృషి పెడతామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ బలంగా ఉన్న చోట మరింత పనిచేస్తే పార్టీ వీక్ గా ఉన్న చోట ఆటోమేటిక్ గా పార్టీకి బూస్టింగ్ వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఏదేమైనా పొంగులేటి, జూపల్లి చేరికను చూపించి మిగతా నేతలకు గాలం వేయాలనేది టీ కాంగ్రెస్ వ్యూహం గా కనిపిస్తుంది. మహబూబ్ నగర్ సభ తర్వాత దూకుడు పెంచాలని చూస్తుంది. కాంగ్రెస్ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం