Telangana: తెలంగాణలో రెండు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..

|

Jan 17, 2024 | 9:15 AM

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను అధిష్ఠానం ఫైనల్‌ చేసింది. మండలిలో పట్టు కోసం ప్రయత్నిస్తోన్న హస్తం పార్టీ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఈ ఇద్దరినే ఎంపిక చేయడానికి కారణాలేంటి..? తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరగబోయే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఫైనల్‌ చేసింది.

Telangana: తెలంగాణలో రెండు  స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
Telanana Mlc Elections
Follow us on

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను అధిష్ఠానం ఫైనల్‌ చేసింది. మండలిలో పట్టు కోసం ప్రయత్నిస్తోన్న హస్తం పార్టీ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఈ ఇద్దరినే ఎంపిక చేయడానికి కారణాలేంటి..? తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరగబోయే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఫైనల్‌ చేసింది. టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఎన్ఎస్‎యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఏఐసీసీ నుంచి ఈ ఇద్దరు నేతలకు సమాచారం అందినట్లు తెలిసింది. ఇవాళ నామినేషన్‌ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తారన్న అంశంపై పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం మాత్రం అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లకు అవకాశం ఇచ్చింది.

ఈ రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. దీంతో అసెంబ్లీలో అత్యధిక బలం కలిగిన కాంగ్రెస్‌ పార్టీ ఈ రెండు ఎమ్మెల్సీలను గెలవనుంది. అద్దంకి దయాకర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా.. ప్రత్యర్థి పార్టీల విమర్శలకు ధీటుగా సమాధానమిస్తూ.. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్ కూడా ఆశించారు. అయితే, మరొకరికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. అద్దంకికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. త్యాగానికి ఫలితంగా మొదటగానే అద్దంకికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. మరోవైపు, బల్మూరి వెంకట్ గత ప్రభుత్వ హయంలో.. నిరుద్యోగులు, విద్యార్థుల తరపున నిరసనలు, ర్యాలీలు నిర్వహించి.. జైలుకు కూడా వెళ్లారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో సైతం బరిలోకి దిగి ఓడిపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఆశించినప్పటికీ.. అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పార్టీకి బలమైన గొంతుగా మారిన బల్మూరి వెంకట్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం.

తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్‌కు 30 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఒక్కరే ఉన్నారు. అయితే మండలిలో పట్టు కోసం కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఈ ఇద్దరు నేతలను ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేసిందని చెప్తున్నారు. రేపటి వరకే నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉండగా.. 29న రెండు స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ రెండు ఎమ్మెల్సీల పదవీకాలం 2027 నవంబర్ వరకు ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..