బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని కాంగ్రెస్ నేతలు తేల్చి చెప్పారు. దమ్ముంటే మూసి ప్రక్షాళనపై చర్చకు రావాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని అడ్డుకుంటే ప్రజలు తిరగబడతారని వారు హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునర్జీవనానికి మద్దతుగా అడ్డగూడూరు మండలం మానాయికుంట వద్ద కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రను నిర్వహించింది. ఈ యాత్రలో భువనగిరి పార్లమెంటుసభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, వేముల వీరేశం పాల్గొన్నారు. వేలాది మందితో కలిసి మానాయకుంట నుంచి మూసీ బ్రిడ్జి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మూసీ ప్రక్షాలను కొనసాగించాలని ప్లకార్డులతో రైతులు ర్యాలీలో పాల్గొన్నారు.
మూసీ నదిలో కలిసే వ్యర్థాలు, కలుషితాలతో పరివాహక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉండి బీఆర్ఎస్ మూసీ ప్రక్షాళన చేయలేదని.. ఇసుక ప్రక్షాళన మాత్రమే చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఎవరు అడ్డుపడిన మూసీ ప్రక్షాళన మాత్రం ఆగదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. మూసీ పునర్జీవంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం తిప్పి కొట్టాలని పిలుపు ఇచ్చారు.
మురికి కూపం నుంచి రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం చేస్తుంటే, ప్రతిపక్షాలు మురికి ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. రాజకీయ స్వార్థంతో ప్రతిపక్షాలు మూసీ పునర్జీవం ను రాజకీయం చేయడం సరికాదని అన్నారు. మూసీ పునర్జీవనంపై ప్రజల మద్దతు కోసం పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహిస్తామని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. లక్ష మంది రైతులతో బహిరంగ సభలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ నేతలు ఇక్కడనేమో రాజకీయం , ఢిల్లీలో గొప్పలు చెప్తున్నారని ఎంపీ చామల అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది.. మూసీ ప్రక్షాళన కాదు.. ఇసుక ప్రక్షాళన అని ఎమ్మెల్యే మందుల సామేల్ విమర్శించారు. మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే ప్రతిపక్ష పార్టీలపై తిరగబడతామని ఆయన హెచ్చరించారు. మూసీ నదిని ప్రక్షాళన చేయకుండా బీఆర్ఎస్ నేతలు ఇసుకతో కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. రాజకీయ స్వార్థంతో ప్రతిపక్షాలు మూసీ ప్రక్షాళనలను రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..