
వేం నరేందర్ రెడ్డి.. ప్రభుత్వ సలహాదారుగా.. సీఎం రేవంత్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. రేవంత్ కాంగ్రెస్‌లోకి రాకముందు నుంచే ఆయన వెంట నమ్మిన బంటులా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం ఏ కార్యక్రమం తలపెట్టినా.. వేం ఆయన వెంటే ఉంటారు. రేవంత్ కోటాలో వేం నరేందర్ రెడ్డికి ఛాన్స్ వరించగా.. అధిష్ఠానం కోటాలో సింఘ్వీకి రాజ్యసభ బెర్త్ తెలంగాణ నుంచి మరోసారి ఖరారు అయింది. ఇప్పటికే ఆయన రెండేళ్ల పాటు తెలంగాణ నుంచే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కేకే రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలో సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు సింఘ్వీని రెన్యువల్ చేశారు.
తెలంగాణ నుంచి రాజ్యసభ రెండు సీట్ల కోసం మొత్తం 36 మంది పోటీ పడగా.. సింఘ్వీ పేరు ఖరారయ్యాక.. ఒక్క సీటు కోసం 16 మంది పోటీ పడ్డారు. వడపోత తర్వాత.. ఆశావాహుల సంఖ్య నాలుగుకు చేరింది. అభ్యర్థుల ఎంపిక చివరి రోజు ఇద్దరి పేర్లు బలంగా వినిపించాయి. టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, వరంగల్ నేత దొమ్మాటి సాంబయ్య, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి చివరి వరకు పోటీ పడ్డా.. సీఎం, టీ.పీసీసీ చీఫ్ వేం నరేందర్ రెడ్డికే మొగ్గు చూపడంతో.. ఆయన్నే ఫైనల్ చేయడం జరిగింది.
అధికార పార్టీ నుంచి ఇద్దరు పోటీ చేయడం, వీరి ఎన్నిక లాంఛనం కావడం ఓకే. కానీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చివరి నిమిషంలో ఏమైనా ట్విస్ట్ ఇస్తుందా?. అవసరమైన సంఖ్యా బలం లేకపోయినా.. పార్టీ మారిన 10మందిని ఇబ్బంది పెట్టేందుకు, విప్ అస్త్రాన్ని ప్రయోగించనుందా అనేది మరికొన్ని గంటలు చూడాలి. వాస్తవానికి రెండు రాజ్యసభ సభ్యులను గెలిపించుకునే సంఖ్యాబలం కాంగ్రెస్ దగ్గర ఉంది. అందులో పార్టీ ఫిరాయించిన పదిమంది కూడా ఉన్నారు. కానీ.. బీఆర్ఎస్ తమ అభ్యర్థిని నిలబెడితే ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థిని నిలిపి విప్ జారీ చేస్తే.. ఆ పదిమంది ఎటు ఓటేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
బీఆర్ఎస్ ఆల్ మోస్ట్ అభ్యర్థిని పెట్టకపోవచ్చన్నది పార్టీ వర్గాల టాక్. గులాబీ పార్టీ రాజ్యసభ బరి నుంచి తప్పుకుంటే.. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇద్దరి నామినేషన్లే వస్తే కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.