
నీళ్లు నిప్పులు అవుతున్నాయి. లెక్కలే అస్త్రాలు అవుతున్నాయి. తెలంగాణ గట్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వార్ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం PPTకి సిద్ధమైంది. ఇందుకోసం పోటీగా BRS కూడా PPTకి రెడీ అయింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడీవేడి రచ్చ మొదలైంది. నీళ్లు నిప్పులుగా మారుతున్నాయి. ఏకంగా పోటా పోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాజకీయాలు ముదురుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాల్లో జరిగిన అవకతవకలను ఎండగట్టేందుకు రేవంల్ సర్కార్ అసెంబ్లీలో పీపీటీని ఒక అస్త్రంగా ఎంచుకుంది. ఇందుకు ప్రతిగా తాము చేసిన అభివృద్ధిని వివరించేందుకు తమకు కూడా పీపీటీ ఇచ్చే అవకాశం కల్పించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పట్టుబడుతోంది.
ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్, గత బీఆర్ఎస్ పాలనలో సాగునీటి రంగంలో జరిగిన అక్రమాలపై ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్, అదనపు ఖర్చు, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వంటి అంశాలపై పక్కా ఆధారాలతో పీపీటీని శాసన సభ వేదికగా ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. శాసనసభ మధ్యలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
కాంగ్రెస్.. బీఆర్‌ఎస్ మధ్య వాటర్ వార్ పీక్స్‌కి చేరింది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేసీఆర్ మారణశాసనం రాశారని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీపడలేదని కౌంటర్ ఇస్తోంది బీఆర్‌ఎస్. ఈ మాటల యుద్ధం ఇప్పుడు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల వరకూ వచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌తోపాటు కృష్ణా, గోదావరి నీటి వాటాలపై ఎప్పుడు ఏం జరిగింది?. బీఆర్‌ఎస్ హయాంలో ఏంచేశారో ఇవాళ అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12గంటలకు కృష్ణా, గోదావరి జలాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన తప్పిదాలను బయటపెట్టాలని ఉత్తమ్ భావిస్తున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించనున్నారు. ఉత్తమ్ ప్రజెంటేషన్ తర్వాత నదీజలాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు.
అయితే, అసెంబ్లీ సెషన్ మొత్తాన్ని బహిష్కరించిన బీఆర్‌ఎస్.. ప్రభుత్వానికి కౌంటర్‌గా తెలంగాణ భవన్‌లో ప్రజెంటేషన్ ఇవ్వబోతోంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు ప్రదర్శన ఇవ్వబోతున్నారు. మరి, ఈ PPT వార్‌లో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారో.. ఎలాంటి సంచలన విషయాలు బయటపెడతారో చూడాలి.. !
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..