అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్తగా నియమితులైన ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ దీపా దాస్‌మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులతో పాటు డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి లోక్‌సభ ఎన్నికల తర్వాత సముచిత స్థానం కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు ఎకరం స్థలం కేటాయించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఎస్సీ కమిషన్ రద్దు చేసి, త్వరలో కొత్త కమిషన్ నియమిస్తామన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా గడవక ముందే.. కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ పుస్తకాలు విడుదల చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
జనవరి 8, 9న పార్లమెంట్ ఎన్నికలపై ఉమ్మడి జిల్లా నేతలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. 11,12,13న పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మంత్రులు, నేతలతో ఎన్నికలపై సమావేశమవుతారు. ఆ తర్వాత 14 నుంచి 4 రోజుల పాటు దావోస్ పర్యటనకు సీఎంతోపాటు మంత్రి శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. ఈ టూర్ తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు సీఎం రేవంత్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..